ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ శాసనసభ చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ శాసనసభ చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 3 నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సదరు తీర్మానానికి ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ పూర్తయిందని, పార్లమెంట్‌లో ఆమోదం పొందడమే తరువాయి అని పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటవుతుందని, ఆ తరువాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మంత్రులు జె.గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బసవరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కె.జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో రాజ్యాంగ పద్ధతుల్లో చర్చ జరిగిందన్నారు.
చర్చ ముగిసిన తరువాత బిల్లును తిరస్కరిస్తూ ఆమోదించిన తీర్మానానికి, బిల్లుకు సంబంధం లేదన్నారు. అర్ధంలేని ఆవేదన, ఆక్రోశంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం సీమాంధ్రుల కంటితుడుపు కోసమే తప్ప రాజ్యాంగ బద్ధత లేదన్నారు. అలాంటి తీర్మానంతో కూడిన బిల్లును కేంద్రానికి పంపుతారా? లేదా? అనేది స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ తీర్మానం అడ్డంకి కానేకాదని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలా? లేదా? అనే అంశం హైకమాండ్ పరిధిలోనిదన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానాలకు రాజ్యాంగ, చట్టబద్దత ఉండదన్నారు. మంత్రి పొన్నాల ఈ సందర్భంగా స్వీట్లు పంచారు.