3 నుంచి మళ్లీ భే‘టీ’
-
అసెంబ్లీ వాయిదా.. జనవరి 3 నుంచి 23 వరకు రెండో విడత..
-
సీఎం పేరుతో ఎమ్మెల్యేలకు బులెటిన్ పత్రాల పంపిణీ
-
విభజన బిల్లుపై మొత్తం 13 రోజుల చర్చ
-
జనవరి 3 నుంచి 10 వరకు ఆదివారం మినహా అన్ని రోజుల్లోనూ..
-
11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు
-
తిరిగి 16 నుంచి 23 వరకు శాసనసభ సమావేశాలు
-
గురువారమూ సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో మార్మోగిన సభలు..
తుపానును ఆపలేకపోయినా విభజనను ఆపుతానన్న మాటకు ఈ రోజుకూ కట్టుబడి ఉన్నా. సమైక్యం కోరుతున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ వారిని నొప్పించకుండా మాట్లాడాలి.
- ముఖ్యమంత్రి కిరణ్
సీమాంధ్ర ఎమ్మెల్యేల బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి సభను వాయిదా వేసిన సీఎం, స్పీకర్ వైఖరికి నిరసనగా వారి దిష్టి బొమ్మలు దహనం చేస్తాం. సభలో బిల్లు పెట్టడమే మాకు ముఖ్యం.
- టీఆర్‌ఎస్
స్పీకర్ మనోహర్ సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గడం సరికాదు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తలనొప్పులు లేకుండా
తెలంగాణ ఏర్పడుతుంది.
- తెలంగాణ టీడీపీ నేతలు
సభలో ముందు సమైక్య తీర్మానం పెట్టాల్సిందే. ఆ తర్వాతే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిదాకా పోరాడతాం.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
దిగ్విజయ్‌సింగ్‌కు స్పీకర్ అమ్ముడు పోయారు. సమైక్యరాష్ట్రానికి సీఎంగా కొనసాగిస్తే చాలని సీఎం సాగిలపడ్డాడు. దిగ్విజయ్ వీళ్లిద్దరినీ డబ్బులతో కొనేశాడు.
- సీమాంధ్ర టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మలివిడత సమావేశాలు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12న ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాలకు స్పీకర్ గురువారం సుదీర్ఘ విరామం ప్రకటించారు. 14 రోజుల విరామం తర్వాత తిరిగి జనవరి 3 నుంచి రెండో విడత సమావేశాలు ఏర్పాటు చేశారు. స్పీకర్ అసెంబ్లీని వచ్చేనెల 3కు వాయిదా వేయగా.. అప్పట్నుంచి ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్న విషయంలో సభా నాయకుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుతో బులెటిన్ జారీ అయింది. శాసనసభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలందరి చేతుల్లో ఈ బులెటిన్ పత్రాలు ప్రత్యక్షమయ్యాయి. సాధారణంగా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారమంతా సభాపతి ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి పేరిట బులెటిన్లు జారీ చేస్తారు.
అయితే సభ్యులకు అందజేసిన బులెటిన్ పత్రాలు మాత్రం శాసనసభాపక్ష నేత కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉండటం చర్చనీయాంశమైంది. ఆ బులెటిన్‌లో గురువారం (19.12.2013) కూడా సభ జరుగుతుందని ఉండగా.. స్పీకర్ మాత్రం వచ్చేనెల 3కు వాయిదా వేశారు. జనవరి 3 నుంచి 23 వరకు సెలవులు మినహాయిస్తే సమావేశాలు మొత్తం 13 రోజులపాటు కొనసాగనున్నాయి. బీఏసీ తీసుకున్న నిర్ణయం మేరకే ఈ తేదీలను ఖరారు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు-2013పై చర్చను కొనసాగించాలని, సభలోని ప్రతి ఒక్క సభ్యుడూ బిల్లులోని ప్రతి క్లాజుపై తన అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. జనవరి 3 నుంచి 10 వరకు మధ్యలో ఆదివారం మినహా అన్ని రోజుల్లో సమావేశాలు కొనసాగుతాయి. శనివారం కూడా సభ జరుగుతుం ది. ఆ తర్వాత ఐదురోజులు (జనవరి 11 నుంచి 15 వరకు) సంక్రాంతి సెలవులిచ్చారు. ఆ తేదీల్లో సమావేశాలు జరుగవు. తిరిగి జనవరి 16 నుంచి 23 వరకు సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యలో శని, ఆదివారాలు (18, 19 వ తేదీల్లో) మినహా మిగిలిన 6 రోజులు సమావేశాలు కొనసాగుతాయి.
నినాదాలతో మార్మోగిన సభలు: అసెంబ్లీ, శాసన మండలిలో గురువారం కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. సభలు ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చర్చ చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి సభలను వాయిదా వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నల్ల దుస్తులు, కాలీప్లవర్‌లతో అసెంబ్లీకి హాజరై నిరసన వ్యక్తం చేశారు. సభ కార్యక్రమాలు జరగని పరిస్థితి నెలకొనడంతో ప్రారంభమైన నిమిషానికే స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం 1.35 గంటలకు మొదలైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో వచ్చేనెల 3కు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభంకాగానే వైఎస్సార్ కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ సభ్యులు ఛైర్మన్ పోడియంలోకి వెళ్లి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ ప్రాంత సభ్యులు వారి స్థానాల్లో నుంచే జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో 5 నిమిషాలకే ఛైర్మన్ సభను వాయిదా వేశారు. తిరిగి 12.25 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రకటన చేస్తానని చైర్మన్ చెప్పడంతో సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లారు. సీఎం ప్రసంగం అనంతరం మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పది నిమిషాలకే సభ వాయిదా పడింది. తిరిగి 1.50కి సభ ప్రారంభమైనా 2 నిమిషాల్లోనే వాయిదా పడింది.
మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం: మాజీ ఎమ్మెల్సీలు పీవీ రంగారావు, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతికి మండలి సంతాపం ప్రకటించింది. వారి మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.