సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లు గురువారం అధికారికంగా రాష్ట్రానికి చేరుకోవడంతో దానిపై శాసనసభలో ఎప్పుడు చర్చకు పెడతారన్న అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో తక్షణమే చర్చకు వస్తుందని తెలంగాణవాదులు, ఈ సమావేశాల్లో బిల్లు సభ ముందుకు రాదని సీమాంధ్ర నేతలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఉభయ సభల అభిప్రాయం చెప్పడానికి జనవరి 23 వరకు రాష్ట్రపతి గడువు విధించడంతో చర్చంతా ఆ గడువుచుట్టే సాగుతోంది. సభలో బిల్లుపై చర్చ ఎప్పుడనే అంశంపై సభానాయకుడిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ మనోహర్‌లు ముందుగా ఒక అభిప్రాయానికి రావాల్సిఉంది. ఆపై బీఏసీలో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలి. బీఏసీలో భిన్నాభిప్రాయాలు ఏర్పడితే అంతిమంగా సీఎం, స్పీకర్‌లదే తుదినిర ్ణయమవుతుంది. ఇలా ఉండగా అసెంబ్లీలో శుక్రవారం జరగబోయే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బిల్లు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం వాడివేడిగా సమావేశాలు జరిగే ఆస్కారం ఉంది. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చేరిన తెలంగాణ బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని స్పీకర్ శుక్రవారం సభలో సభ్యులకు తెలియచే యనున్నారు.
శాసనసభ 77, 78 నిబంధనల కింద వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ సభ్యులు సమైక్య తీర్మానం కోసం స్పీకర్‌కు నోటీసులు అందించి ఉండడంతో సీమాంధ్రనేతలంతా దానిపై పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి నుంచి విభజన బిల్లు అసెంబ్లీకి చేరినందున దానిపైనే చర్చ చేపట్టాలని తెలంగాణ సభ్యులు డిమాండ్ చేయనున్నారు. త్వరగా చర్చను ముగించి విభజన బిల్లును రాష్ట్రపతికి పంపాలని డిమాండ్‌ను వినిపించనున్నారు. ఇలావుండగా, రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లుపై చర్చకోసం స్పీకర్ మనోహర్ ఆదివారం లేదా సోమవారం సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ సమావేశంలో జరిగే చర ్చను అనుసరించి బిల్లును అసెంబ్లీలో ఏరోజున ప్రవేశపెట్టనున్నారో తేలనుంది. బీఏసీలో కూడా ఇరుప్రాంతాల నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్రకు చెందిన మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు ఇతర నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్, తోట నరసింహం, అహ్మదుల్లా, కొండ్రు మురళీ మోహన్, విప్ రుద్రరాజు పద్మరాజు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
రాష్ట్రపతి నుంచి బిల్లుకు సంబంధించి 400 ప్రతులు వచ్చాయని సీఎం మంత్రులకు తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినా ఇప్పుడే దీనిపై చర్చించే అవకాశం లేదని సీఎం కిరణ్ మంత్రులకు చెప్పినట్టు సమాచారం. బిల్లును సభ్యులంతా సమగ్రంగా అధ్యయనం చేసేందుకు తగినంత సమయం కావాల్సి ఉంటుందని, ఈ సమావేశాల్లో కాకుండా జనవరిలోనే ప్రత్యేకంగా సమావేశాలు పెట్టడంపై ఆలోచించాలని చెప్పారు. సభలో ఎంతమంది మాట్లాడదలచారో అందరికీ అవకాశం ఇవ్వాల్సిందేనని, వారందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే బిల్లుపై రాష్ట్రపతికి తిరిగి పంపాల్సి ఉంటుందని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకునే విధంగా చర్చ జరగాలంటే రెండుమూడు వారాలైనా అవసరమని, ఈ సమావేశాల్లో చర్చకు తాను అంగీకరించనని సీఎం చెప్పినట్టు సమావేశంలో పాల్గొన్న ఒక మంత్రి తెలిపారు. ఎంతోకాలంగా తెలంగాణపై చర్చ సాగుతోందని, ఈ సమయంలో ఇంకా వాయిదా వేసుకుంటూ వెళ్లకుండా తక్షణం సభలో చర్చకు పెట్టి తిరిగి రాష్ట్రపతికి పంపించాలని తెలంగాణ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ మేరకు సభలో గట్టిగా పట్టుబట్టాలని భావిస్తున్నారు.