'ఏపీలోనే అంగన్ వాడీలకు తక్కువ వేతనం'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంగన్ వాడీలకు తక్కువ వేతనం ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. మన పక్క రాష్ట్రాలతో్ చూసుకుంటే ఏపీ అంగన్ వాడీలకు జీతం మితంగా ఉందన్నారు. అంగన్ వాడీలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అంగన్ వాడీల సమస్యలపై వైఎస్సార్ సీపీ పట్టుబట్టడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది.
ఆ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రోజా.. అంగన్ వాడీ కార్యకర్తలను నిర్దాక్షణ్యంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి తమ గోడు వెళ్లబోసుకుందమని వచ్చిన కార్యకర్తలను పోలీసులు లాక్కోని పోవడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందన్నారు.మన రాష్ట్రంలో తప్ప చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంగన్ వాడీలను అర్ధం చేసుకున్నారని.. అందుచేత వారికి వేతనాలు బాగున్నాయన్నారు. అంగన్ వాడీలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తోందని రోజా తెలిపారు.