సాక్షి, హైదరాబాద్: శాసన సభలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన సమావేశాల దృశ్యాల క్లిప్పింగ్‌లను టీడీఎల్పీలో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చే సిన ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మంగళవారం ఉదయం పలువురు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నోటీసును వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేత ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, పాముల పుష్ప శ్రీవాణి, ఆర్.కె.రోజా, డాక్టర్ సునీల్ కలసి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వద్దకు వెళ్లి నోటీసును అందజేశారు. కాలువ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలనుద్దేశించి అన్‌పార్లమెంటరీ పదజాలాన్ని ప్రయోగించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. సభా కార్యక్రమాల దృశ్యాలను చీఫ్ విప్ ఏ నిబంధనల కింద విడుదల చేశారో కూడా తెలియదని, అందువల్ల ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదిస్తున్నామని అందులో వివరించారు.
మంత్రులపై నోటీసులు
శాసన సభలో పలు అంశాలపై చర్చ జరుగుతుండగా జోక్యం చేసుకుని తమ పార్టీ సభ్యులపై అసందర్భమైన, అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు అన్‌పార్లమెంటరీ పదజాలాన్ని వాడుతున్న మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. వీరు అభ్యంతరకరమైన హావభావాలను ప్రదర్శిస్తూ అసభ్య పదజాలంతో బెదిరించే విధంగా సభలో మాట్లాడుతున్నారని స్పీకర్‌కు ఇచ్చిన వేర్వేరు నోటీసుల్లో పేర్కొన్నారు. ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ శివప్రసాద్‌రావుకు ఈ నోటీసులను అందజేశారు. శాసన సభ్యులు కూడా కాని, మరణించిన వ్యక్తులపై కూడా అభ్యంతరకర పదజాలాన్ని వినియోగిస్తున్నారని, ఇది సభా నిబంధనలకు విరుద్ధమని వివరించారు. వారు చేసిన వ్యాఖ్యల నిర్థారణ కోసం అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని కోరారు.
కాలువ శ్రీనివాసులుపై సభా హక్కుల నోటీసు
Published Wed, Mar 25 2015 2:22 AM | Last Updated on Sat, Aug 11 2018 4:22 PM
Advertisement
Advertisement