తెరపై పాఠం.. ఏకాగ్రతకు నేస్తం
డోకులూరు ఆశ్రమంలో డిజిటల్ క్లాస్ రూమ్
అందుబాటులోకి తెచ్చిన తెలుగు పండిట్
పాడేరు: మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఆధునిక బోధన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దృశ్య శ్రవణ విధానంలో బోధిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకే ఇది పరిమితం. ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మండలంలోని డోకులూరు ఆశ్రమ విద్యార్థులకు ఈ విధానంలో బోధించాలని గిరిజన ఉపాధ్యాయుడు సంకల్పించారు. ఈ పాఠశాలలో తెలుగు పండితుడిగా మూడేళ్లుగా పని చేస్తున్న శోభ నారాయణ సుమారు రూ.70 వేలు సొంత ఖర్చుతో ఇందుకు అవసరమైన ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్, సౌండ్‌సిస్టం, స్క్రీన్ వంటి ఆధునిక పరికరాలతో డిజిటల్ క్లాస్ రూంను ఏర్పాటు చేశారు.
8,9,10 తరగతుల విద్యార్థులకు గురువారం నుంచి ఈ దృశ్య విద్యాబోధన ప్రారంభించారు. తెలుగు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల బోధనకు అవసరమైన డిజిటల్ సామగ్రిని సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలలోని అంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో రూపొందించిన స్టడీమెటీరియల్ అంతర్జాలం నుంచి సేకరించి బోధిస్తున్నారు. ఇది విద్యార్థుల్లో ఏకాగ్రతను, ఆసక్తిని పెంచేవిధంగా ఉంది. రోజూ బోధనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. విద్యుత్ అంతరాయం కూడా లేకుండా ఇన్వెర్టర్ సమకూర్చారు. దిగువస్థాయి తరగతుల పిల్లలకు స్టడీ అవర్స్‌లో నీతిని బోధించే పంచతంత్ర కథలను దృశ్య, శ్రవణం ద్వారా బోధించేందుకు ఏర్పాట్లు చేశారు.
అభినందనీయం, ఆదర్శనీయం...
ఆశ్రమ పాఠశాలలో దృశ్య శ్రవణ విద్యాబోధనను అందుబాటులోకి తెచ్చిన తెలుగు పండిట్ శోభ నారాయణ అభినందనీయులని, డిజిటల్ క్లాస్‌రూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావు, ఎంఈవో బాబూరావు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.సూర్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాణిక్యాలరావు ప్రశంసించారు. మన్యంలోనే ప్రథమంగా ఒక ఆశ్రమ పాఠశాలలో ఈ విద్యాబోధనను ప్రారంభించి నారాయణ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారన్నారు.
పాఠాలు గుర్తుండిపోతాయి..
దృశ్య, శ్రవణ విద్యాబోధన వల్ల విద్యార్థులకు పాఠాలు గుర్తుండిపోతాయి. పిల్లల్లో చదువుపట్ల అవగాహన, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ దృశ్య విద్యను తరగతిలో విద్యార్థులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. తెలుగు సబ్జెక్టులో పాఠ్యాంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో బోధించడమే కాకుండా బోర్డు మీద రాసి చెప్పే వ్యాకరణం, పద్యాలు వంటి వాటిని కూడా విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో సులువుగా బోధించడానికి ఎంతో ఆస్కారం ఉంది. అలాగే సైన్స్ పాఠ్యాంశాలను కూడా దృశ్య, శ్రవణ విద్య ద్వారా బోధించడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఏడాది పొడవునా పిల్లలకు ఈ దృశ్య, శ్రవణ విద్యాబోధనకు అవసరమైన ఏర్పాట్లు చేశాం.
- శోభ నారాయణ,
తెలుగు పండిట్, డోకులూరు.