తొలి రోజు అంతంతే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ :
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా తొలిరోజు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. కోడూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బండి శ్రీనివాసరావు ఈ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో 836 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 32 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తిస్థాయిలో ఖరారు కాకపోవటంతో తక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి.
మంగళ, బుధవారాల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 49 మండలాల్లో పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థులంతా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు హాలులో తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎంపీటీసీ సభ్యులు స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి.
జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జెడ్పీటీసీ సభ్యుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఐదు కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా సీఈవో డి.సుదర్శనంతో పాటు మరో ఆరుగురు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
విధులు సక్రమంగా నిర్వహించండి : కలెక్టర్
జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కౌంటర్లను సోమవారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు అన్ని ఖాళీలూ పూర్తి చేసినదీ, లేనిదీ పరిశీలించిన అనంతరం పత్రాలు తీసుకోవాలన్నారు. అన్ని కౌంటర్లను పరిశీలించి ఆయన అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను పరిశీలించి, అక్కడ వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉగాది తరువాత పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలను జెడ్పీ సీఈవో, ఎంపీటీసీ ఎన్నికలను ఆయా మండలాలకు నియమించిన ప్రిసైడింగ్ అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ వివరించారు.
ఎంపీటీసీలకు నామినేషన్లు ఇలా...
జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలివీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8, టీడీపీ 12, ఇండిపెండెంట్లు 10, కాంగ్రెస్ 1, బీజేపీ 1 చొప్పున నామినేషన్లు దాఖలు చేశాయి. గూడూరులో 1 (స్వతంత్ర), కృత్తివెన్ను 2 (టీడీపీ), మొవ్వ 3 (టీడీపీ-2, స్వతంత్ర 1), నాగాయలంక 1 (వైఎస్సార్ సీపీ), కైకలూరు 3 (స్వతంత్ర), మండవల్లి -2 (బీజేపీ-1, స్వతంత్ర-1), పెదపారుపూడి -1 (స్వతంత్ర), ఇబ్రహీంపట్నం -1 (స్వతంత్ర), కంచికచర్ల 2 (టీడీపీ), కంకిపాడు 1 (స్వతంత్ర), పెనమలూరు 2 (వైఎస్సార్ సీపీ), పెనుగంచిప్రోలు 2 (వైఎస్సార్ సీపీ), విజయవాడ రూరల్ 1 (స్వతంత్ర), ఆగిరిపల్లి 2 (టీడీపీ), బాపులపాడు 3 (వైఎస్సార్ సీపీ 1, టీడీపీ 2), ముసునూరు 1 (కాంగ్రెస్), తిరువూరు 2 (టీడీపీ), ఉంగుటూరు 2 (వైఎస్సార్ సీపీ) నామినేషన్లు దాఖలయ్యాయి.
జిల్లాలో 20,89,820 మంది ఓటర్లు...
జిల్లాలోని 49 మండలాల్లో మొత్తం ఓటర్లు 20,89,820 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 10,39,430, మహిళా ఓటర్లు 10,50,239 మంది. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 10,809 మంది అధికంగా ఉన్నారు.