నల్లగొండ, న్యూస్‌లైన్,ప్రాదేశిక ఎన్నికల పోరులో అభ్యర్థుల తుది జాబితా ఎట్టకేలకు పూర్తయింది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత తుది జాబితా రూపొందించడంలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. అర్ధరాత్రి 11గంటల వరకు జెడ్పీటీసీ స్థానాల జాబితా పూర్తికాగా, ఎంపీటీసీ స్థానాలపై అభ్యర్థుల ఖరారు ప్రక్రియ అర్ధరాత్రి దాటే వరకు సాగింది. జెడ్పీటీసీ 59 స్థానాలకు గాను వివిధ పార్టీలకు చెందిన 395మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ స్థానాలకు మొత్తం 1220 నామినేషన్లు అర్హత పొందాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న నామినేషన్లను తొలగించిన తర్వాత నామినేషన్ల సంఖ్య 875కు చేరింది. ఇందులో సోమవారం నాటికి 480మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో అధికారికంగా జెడ్పీటీసీ స్థానాలకు 395 మందిని అధికారులు ఖరారు చేశారు. అయితే 2006 ఎన్నికల్లో 59జెడ్పీటీసీ స్థానాలకు ఒకస్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన 58 స్థానాలకు 509మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాగా ఆ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 114కు తగ్గింది. ఇదిలా ఉండగా 834 ఎంపీటీసీ స్థానాలకు గాను అభ్యర్థులు ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం కాలేదు. మంగళవారం ఉదయానికి తుది జాబితా వెల్లడయ్యే సూచనలు ఉన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 16 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
బీఫారాల కోసం తమ్ముళ్ల తన్నులాట
బీఫారం కోసం తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. దామరచర్ల జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు టీడీపీ నుంచి హతీరాం నాయక్, వై.సాంబశివరావు తలపడ్డారు. తొలుత హతీరాం నాయక్ బీఫారం తీసుకుని లోపలికి ప్రవేశించారు. దీంతో వై.సాంబశివరావు వర్గీయులు కార్యాలయంలోకి చొరబడి హతీరామ్ నాయక్ చేతుల్లోంచి బీ పారం లాక్కొని కిటికీల్లోంచి బయటకు పడేశారు. ఈ సమయంలో హతీరామ్ నాయక్‌పై ప్రత్యర్థులు దాడికి దిగడంతో కార్యాలయంలో తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో అధికారుల టేబుల్‌పై ఉన్న కంప్యూటర్ మానిటర్ కిందపడింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపారు.
ఆ తర్వాత బయట పడేసిన బీఫారాన్ని సాంబశివరావు వర్గీయులు తీసుకొని దానిపై హతీరాం నాయక్ పేరు కొట్టేసి సాంబశివరావు వివరాలు రాశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా బీఫారం సరిగా లేనందున అధికారులు దాన్ని తిరస్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా నిర్ణయించారు. ఈ ఘర్షణ అనంతరం సాంబశివరావు వర్గీయులు హతీరామ్‌ను బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ పోటీ చేసే అవకాశం తనకు రానట్లయితే ఆత్మహత్య చేసుకుంటానని వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం తీవ్రంగా మారడంతో జెడ్పీ ఆవరణలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ సంఘటనపై బాధితుడు హతీరామ్ నాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.దామోదర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణకు ఈ ఫిర్యాదును పంపినట్లు సీఈఓ తెలిపారు.
కాంగ్రెస్, టీడీపీలో రెబల్స్ బెడద
కాంగ్రెస్, టీడీపీల నుంచి భీపారం లభించని అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యర్ధులతో తలపడాల్సిన ప్రధాన పార్టీల అభ్యర్థులు రెబల్స్‌తో పోటీ పడాల్సి వస్తోంది. కట్టంగూరు జెడ్పీటీసీ స్థానం నుంచి ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా నకిరేకల్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఎమ్మెల్యే చిరుమర్తి ప్రతిపాదించిన అభ్యర్థితో పాటు, ఆయన వర్గానికే చెందిన రాచకొండ భిక్షమమ్మ కూడా రెబల్ అభ్యర్థిగా ఉన్నారు.
జెడ్పీటీసీ బరిలో 395 మంది
Published Tue, Mar 25 2014 12:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement