తొలి ఘట్టం ముగిసింది..
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్, స్థానిక సంస్థల ఎన్నికల తొలి ఘట్టం గురువారం ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ పూర్తరుుంది. అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ల దాఖలుకు పోటీ పడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు గడిచిన మూడు రోజుల్లో 158 దాఖలు చేయగా ఆఖరు రోజున 619నామినేషన్లు వేశారు. ఉదయం 10గంటల నుంచే జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణం నామినేషన్‌లు వేసే అభ్యర్థులు, వారి మద్దతుదారులతో నిండిపోయింది. బుధవారం నామినేషన్ల స్వీకరణలో సమయం చాలా వృథా అయిన విషయాన్ని గుర్తించిన అధికారులు.. కొన్ని మార్పులు చేశారు. నామినేషన్ల పత్రంతో పాటు అనుబంధం ఫారం(రూఢీ పత్రం) నింపడం కొత్త కావడం వల్ల ఈ జాప్యం జరిగింది.
రిటర్నింగ్ అధికారి ఉన్న జెడ్పీ హాల్‌లోకి పోకముందే కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఫాంలను నింపే కార్యక్రమం చేపట్టారు. దీంతో నామినేషన్లు సరిగా ఉన్న వారు నేరుగా రిటర్నింగ్ అధికారికి సమర్పించే వెసలుబాటు దొరికింది. 19వ తేదీన ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకు మొత్తం 155 నామినేషన్లను తీసుకోగా.. ఈ ఏర్పాటు వల్ల గురువారం సాయంత్రం 5 గంటల వరకు 180 నామినేషన్లు తీసుకున్నారు.
చివరకు నామినేషన్లు దాఖలు చేసే సమయం సాయంత్రం 5గంటలకు ముగియడంతో జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న వారికి టోకెన్లు అందించారు. టోకెన్లు తీసుకున్న వారు రాత్రి 10గంటల వరకు నామినేషన్లు వేయగా.. అధికారులు స్వీకరించారు.
నేడు నామినేషన్ల పరిశీలన
జిల్లాలోని 50 జెడ్పీటీసీ, 705 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు 777 మంది, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు 6192 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన వారి పత్రాలు సరిగ్గా ఉన్నాయా... నిబందనల ప్రకారం పూరించారా...లేదా అన్న విషయాలను రిటర్నింగ్ అధికారి సమక్షంలో శుక్రవారం పరిశీలన(స్కృటినీ) చేసిన అనంతరం బరిలో ఉన్న వారి నామినేషన్ల జాబితాలను ప్రకటిస్తారు.
రేపు అభ్యంతరాల స్వీకరణ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు వివిధ కారణల వల్ల స్కృటినీలో తిరస్కరించ బడితే అందుకు కారణాలను రిటర్నింగ్ అధికారి పేర్కొంటారు. ఈ అంశాలపై పరిశీలన చేసేందుకు 22వ తేదీన అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల ముందు మరోసారి పరిశీలించి ఖరారు చేస్తారు.