
అడుగేద్దాం..కడిగేద్దాం..
ఎన్నికల సమయంలో ఎడాపెడా చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ సీపీ సన్నద్ధమైంది.
గుంటూరు సిటీ : ఎన్నికల సమయంలో ఎడాపెడా చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ సీపీ సన్నద్ధమైంది. ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నాయకత్వంలో మహాధర్నా జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల తరువాత జిల్లా స్థాయిలో జరుగుతున్న అతి ముఖ్యమైన కార్యక్రమం కావడంతో దీన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ధర్నా జరగనున్న ప్రాంతాన్ని గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు నగర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పర్యవేక్షకుడు ఆళ్ల పేరిరెడ్డి తదితరులు పరిశీలించారు.
అనంతరం అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ లేకపోవడంతో మహాధర్నాకు అనుమతి కోరుతూ అందుబాటులో ఉన్న ఏఎస్పీ భాస్కరరావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ చైర్మన్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ సయ్యద్ మహబూబ్, అరవ తిమ్మరాజు, బండారు సాయి, రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, అత్తోట జోసఫ్, గంగాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది ..
మర్రి రాజశేఖర్
రాష్ట్రంలో నడుస్తున్న దగాకోరు పాలనకు వ్యతిరేకంగానే వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ మహాధర్నాకు పిలుపు ఇచ్చినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. స్వయంగా ప్రజలే ప్రభుత్వంపై పోరుకు సన్నద్ధంగా ఉన్నారని వివరించారు. నమ్మి ఓట్లేసిన నేరానికి నట్టేట ముంచిన బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో జరుగుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు.
గుంటూరు నగర అధ్యక్షుడు,రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్త ఫా, లాలుపురం రాము, నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జరగనున్న మహాధర్నాకు నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్నట్లు చెప్పారు.
రుణమాఫీపై బాబు ప్రకటన హాస్యాస్పదం : ఉమ్మారెడ్డి
రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. తొలి సంతకంపైనే ఆయనకు ఇంకా స్పష్టత లేకపోవడం విచారకరమన్నారు. శివరామకృష్ణన్, కోటయ్య కమిటీ నివేదికల ప్రకారం తొలుత రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన వారుగా లక్షా 29వేల మందిని గుర్తించగా, తెలుగుదేశం ప్రభుత్వం ఆ సంఖ్యను 85వేలకు కుదించిందన్నారు. మొదట లక్షన్నర లోపున్న అందరికీ ఒకే దఫా రుణమాఫీ చేస్తానన్న బాబు తాజాగా తొలి విడతలో రూ. 50వేల లోపు అప్పున్న వారికి మొత్తాన్ని ఇచ్చేట్లు, అంతకు మించి పైన ఉన్న రుణగ్రహీతలకు అందులో 20శాతం మాత్రమే చెల్లించే విధంగా చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. మిగిలిన మొత్తానికి బాండ్లు ఇస్తానంటున్నారు కానీ అవి ఎంత వరకు చట్టబద్ధమో అన్నది ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు.