సైనికుడి నుంచి క్రిమినల్‌గా..
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: తండ్రి ఆయశం మేరకు ఆయన సైనికుడిగా దేశరక్షణలో పాలుపంచుకున్నాడు.. కానీ డబ్బుపై ఆశ.. జల్సాపై మోజు.. దురలవాట్లకు బానిసై నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. స్థానిక బొమ్మలసత్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం నుంచి రూ. 1.40 కోట్లు కాజేసిన గోవర్దన్ నేరచరిత్ర ఇది. చిత్తూరు జిల్లా పాకాల మండలం పాలగుట్టుపల్లె గ్రామానికి చెందిన రెడ్డెప్ప సీఆర్పీఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా రక్షణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లోని పని చేస్తున్నారు.
ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని చాంద్రాయన్ గుట్టలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. తనలాగే కొడుకు గోవర్దన్ కూడా దేశానికి సేవ చేయాలనేది రెడ్డెప్ప ఆశయం. దీంతో సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఫ్లస్‌టూ చదివిన గోవర్దన్‌ను భారత సైన్యంలో చేర్పించాడు. గోవర్దన్ ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్‌లో అల్వార్‌లలో పారాటూపర్ హాదాలో పని చేశారు. కాని గోవర్దన్ సైనికుడిగా ఉంటూనే చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం వదిలేసి ఘరాన క్రిమినల్‌గా మారాడు.
జల్సాలు, దురలవాట్లే కారణం: గోవర్దన్‌కు చెడు అలవాట్లు ఎక్కువ. అల్వార్‌కు రైలులో సైనికుడి దుస్తుల్లో వెళ్తూ నిద్రపోతున్న మహిళల ఆభరణాలు, నగదును కాజేసేవాడు. 2011లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిల్లర దొంగతనాలకు పాల్పడుతూ బాలానగర్ సీసీఎస్ పోలీసులకు దొరికాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి నేరస్తుడిగా మారాడు. ఈ సేవా కేంద్రాల ద్వారా ఇతరుల ఓటరు కార్డులను సేకరించి, వాటిని ఫొటోషాప్‌లో మార్పింగ్ చేసి అతని ఫొటో ఉన్నట్లు నకిలీ కార్డులను తయారు చేశాడు. వీటి ఆధారంగా పలు బ్యాంక్‌ల్లో ఖాతాలను తెరిచి, ఏటీఎంలను సంపాదించాడు.
వాటి ద్వారా ఇతరుల ఖాతాల్లో నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసే విధానం ద్వారా రూ.11లక్షలను డ్రా చేశాడు. కాని ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్ పోలీసులకు చిక్కడంతో, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జైలు జీవితం అనుభవించి, పరివర్తన చెందకపోగా విజయవాడకు చెందిన నేరస్తుడు సుధాకర్ ద్వారా ఏటీఎంలలో ఇతరులు డబ్బు డ్రా చేసే విధానాన్ని కనిపెట్టాడు. తర్వాత రెండు నెలల క్రితం బొమ్మలసత్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేయడానికి యత్నించి, క్యాన్సిల్ బటన్ నొక్కాడు. బ్యాంక్ లావాదేవీలు నిలిచి పోలేదు. గోవర్దన్‌కు డబ్బు రాగా, అతని ఖాతాలో నుంచి డబ్బు క్రెడిట్ కాలేదు.
దీంతో రోజూ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేవాడు. తన వద్ద ఉన్న 31 ఏటీఎం, క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 14 నుంచి మే 3వరకు నంద్యాలలోనే మకాం వేసి రోజూ కొంత మొత్తంగా దాదాపు రూ.1.40 కోట్లను డ్రా చేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా నల్ల అద్దాలు, టోపీని ధరించేవాడు. కాని డబ్బును పోగొట్టుకున్న ఖాతాదారులకు ఎస్‌బీఐ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 20 త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇలా చిక్కాడు: సీసీ కెమెరాల్లో ఉన్న దృశ్యాల ఆధారంగా పోలీసులు అతికష్టం మీద గోవర్ధన్‌ను గుర్తించి ఏటీఎం సెంటర్‌వద్ద మాటు వేశారు. కడపలో ఓ యువతిలో కలిసి కారులో నంద్యాలకు వచ్చిన గోవర్దన్ ఏటీఎం కేంద్రం వద్ద మళ్లీ డబ్బు డ్రా చేయడానికి యత్నించాడు. పోలీసులు వెంటపడటంతో కర్నూలు మీదుగా బెంగుళూరు హైవేలో వెళ్తూ గుంతకళ్ పోలీసులకు చిక్కాడు. వీరి నుంచి నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుండి రూ.73లక్షల విలువైన నగదు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, కారును స్వాధీనం చేసుకున్నారు.