విజయవాడ సిటీ :నగరంలోని ఏటీఎం (ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్) కౌంటర్లలో బ్యాటరీలు దొంగిలిస్తున్న ముగ్గురిని సెంట్రల్ క్రైంస్టేషన్ (సీసీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.37 లక్షల విలువైన 66 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నగరానికి చెందిన కాళ్ల సుబ్రహ్మణ్యం, షేక్ అహ్మద్ ఆలీ, షేక్ మహ్మద్ వలీ ఉన్నారని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
జరిగిందిలా..
మొదటి నిందితుడైన సుబ్రహ్మణ్యం వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. కొంతకాలం పాటు ఏటీఎంలకు ఎలక్ట్రీషియన్‌గా పని చేశాడు. వ్యసనాలకు లోనై సంపాదించిన సొమ్ము జల్సాలకు చాలక పోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏటీఎంలలో బ్యాటరీలను దొంగిలించి అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులైన షేక్ అహ్మద్ ఆలీ, షేక్ అహ్మద్ వలీతో కలిసి బ్యాటరీల చోరీ ప్రారంభించాడు. మూడు నెలల వ్యవధిలో నగరంలోని మాచవరం, సత్యనారాయణపురం, పటమట, పెనమలూరు, సూర్యారావుపేట, అజిత్‌సింగ్‌నగర్, కృష్ణలంక పోలీసు స్టేషన్ల పరిధిలో పలు ఏటీఎంలలో బ్యాటరీలు దొంగిలించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంప్రాంతాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 66 బ్యాటరీలు చోరీ చేశారు.
ఇలా
ఏటీఎంలలో వరుసగా బ్యాటరీలు అపహరణకు గురవుతుండడంపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. ఏసీపీ (క్రైం) గుణ్ణం రామకృష్ణ పర్యవేక్షణలో ఎస్సై వి.అప్పారావు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. సూర్యారావుపేటలోని చెరుకుపల్లి వారి వీధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సుబ్రహ్మణ్యం ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, నేరాలు అంగీకరించారు. వారిని అరెస్టు చేసి, సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎం బ్యాటరీల చోరీ ముఠా అరెస్టు
Published Thu, Dec 18 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement