సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతిలో జ్యోతి హత్యోదంతం మరువకముందే ఏపీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒంటిపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడే మృతిచెందగా, యువకుడు రక్తపు మడుగులో కొనఊపిరితో పడిఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యం నిమిత్తం యువకుడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కొండపై గల గుంటుపల్లి బౌద్దారామం సందర్శనకు వచ్చిన జంటపై దాడికి పాల్పడ్డారని స్థానికుల సమాచారం.
యువకుడిపై అనుమానం..
ఇదిలావుండగా ఘటనలో యువతి అక్కడిక్కడే మృతి చెందగా, గాయాలతో బయటపడిని యువకుడు నవీన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో యువకుడిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. యువకుడు చెపుతున్న సమాధానాలపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొండపైకి యువతీ, యువకుడికే టికెట్ ఇచ్చినట్లు స్థానిక వాచ్‌మెన్ తెలిపారు. భీమడోలు సమీపంలోని గ్రామానికి చెందని నవీన్ డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనతో జీలకర్రగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment