అల్లవరం, న్యూస్‌లైన్ : సులువుగా డబ్బు సంపాదించడానికి ఏటీఎంలో చోరీయే మేలనుకున్నాడు ఆ దుండగుడు. అందుకనుగుణంగా సరంజామా తీసుకుని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు, సీసీ కెమేరాకు చిక్కకుండా అప్రమత్తంగా వ్యవహరించాడు. అయితే గునపంతో ప్రయత్నించినా ఏటీఎం తెరుచుకోకపోవడంతో.. దానిని అక్కడే పడేసి ఊసూరుమంటూ వెనుదిరిగాడు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అల్లవరం బ్రాంచి కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమేరా ఫుటేజి ఆధారంగా దుండగుడిని గుర్తించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు, బ్యాంకు బ్రాంచి మేనేజర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్‌బీఐ అల్లవరం బ్రాంచి కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎంలోకి మంగళవారం అర్ధరాత్రి 12.08 గంటలకు ఓ దుండగుడు ప్రవేశించాడు. తలమూసి ఉన్న జర్కిన్ ధరించి ఉన్నాడు. ముఖం కనిపించకుండా కర్చీఫ్‌ను కట్టుకున్నాడు. ఏటీఎంలోని సీసీ కెమేరాకు రబ్బరు స్టిక్కర్ అతికించి అతడిని, అతడు చేసే పని రికార్డు కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఏటీఎంకు ఉన్న విద్యుత్ సరఫరా, డేటా కేబుల్‌లను తొలగించాడు. వెంట తెచ్చుకున్న గునపంతో ఏటీఎంను పెకలించి నగదు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఏటీఎంను పగులగొట్టలేక పోవడంతో.. చేసేదిలేక గునపాన్ని బయట పడేసి వెనుదిరిగాడు.
బుధవారం ఉదయం ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వెళ్లిన ఖాతాదారులు ఏటీఎం పనిచేయకపోవడం, అందులో చోరీకి యత్నించినట్టు ఉండడాన్ని గమనించి ఆ బ్యాంక్ ఉద్యోగికి విషయం తెలిపారు. ఆయన ఈ విషయాన్ని బ్రాంచి మేనేజర్ ఎం.జగన్‌మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రాంచి మేనేజర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై కె.విజయబాబు సంఘటన స్థలాన్ని, సీసీ కెమేరా పుటేజిని పరిశీలించారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయబాబు తెలిపారు.