ఆకర్షించి.. అగాధంలోకి నెట్టి...
- విద్యార్థినుల నీలిచిత్రాలు తీసిన ముఠా అరెస్టు
- తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త
- ధైర్యంగా పోలీసుల వద్దకు రండి
వాళ్లంతా ఇంటర్ చదివే విద్యార్థినులు. తెలిసీ తెలియని వయస్సులో మోసగాళ్ల ‘ఆకర్షణ’లో పడ్డారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయంలో అగాధంలో చిక్కుకున్నారు. ఆ విష ‘వలయం’ నుంచి బయటకు రాలేక విలవిల్లాడారు. ఎట్టకేలకు ఓ బాధితురాలు ధైర్యం చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నీలిచిత్రాల ముఠా సభ్యులను కటకటాల్లోకి నెట్టారు.
విజయవాడ సిటీ : నగరం మెట్రో సంస్కృతి వైపు శరవేగంగా అడుగులు వేస్తూనే..ప్రమాదకర సంకేతాలు(డేంజర్ సిగ్నల్స్) పంపుతోంది. మెట్రో కల్చర్‌ను అవకాశంగా తీసుకుని కాలేజీ విద్యార్థినులను ఆకర్షించి వలలో వేసుకుని నీలి చిత్రాలు తీసి..ఆపై బ్లాక్ మెయిలింగ్ చేసి సొమ్ము చేసుకునే ముఠాలు తయారయ్యాయి. ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ఏడుగురు సభ్యుల ముఠా 10మందికి పైగా ఇంటర్ చదివే కాలేజీ విద్యార్థినులను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసి..బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టు గుర్తించామని నగర పోలీసు కమిషనర్ ఎ.బి వెంకటేశ్వరరావు తెలిపారు.
శనివారం డీసీపీ(శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. కానూరుకు చెందిన నిమ్మకూరి సాయిరాం అలియాస్ రాంచరణ్(పాత నేరస్తుడు), కృష్ణలంకకు చెందిన పరశపు దీపక్, గాంధీనగర్‌కు చెందిన పసుమతి అభిలాష్, నున్నకు చెందిన షేక్ మున్నా, మరో ఇద్దరు, ఓ మైనరు కలిసి ఈ అనైతిక చర్యలకు ఒడిగట్టినట్టు తెలిపారు. వీరు విద్యార్థినులను మభ్యపెట్టి తీసిన నీలిచిత్రాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు తమ ఇళ్లల్లో, గదుల్లో రహస్యంగా అమర్చిన కెమెరాలతోనూ, సెల్‌పోన్ల ద్వారా నీలి చిత్రాలు తీసినట్టు పోలీసులు గుర్తించారు. కొందరికి మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగా నీలి చిత్రాలు తీశారన్నారు. వీరు నీలి చిత్రాలు తీస్తున్న విషయం విద్యార్థినులకు తెలియదని, కొందరికి తెలిసినా బయటకు తెలిస్తే పరువుపోతుందని చెప్పుకోలేదన్నారు. నేరస్తులందరికీ అక్కా చెల్లెళ్లు ఉండటం విశేషమని పోలీసు కమిషనర్ చెప్పారు.
ధైర్యంగా ముందుకు రండి...
ఇంకా ఇలాంటి ముఠాలు ఉండొచ్చని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రావాలని, సున్నిత అంశం కాబట్టి బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయమని ఆయన అన్నారు. ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులుంటే నమ్మకమైన తెలిసిన వ్యక్తుల ద్వారా తగిన ఆధారాలు పోలీసులకు అందజేసినా సరిపోతుందన్నారు.
కఠిన చర్యలు...
విద్యార్థులు చదువుకోవడమే లక్ష్యంగా కళాశాలలకు వెళ్లాలని, అంతే తప్ప ఈవ్‌టీజింగ్ వంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటికే పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు.
తల్లిదండ్రులూ జాగ్రత్త
కాలేజీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ సూచించారు. వీరి చేతిలో మోసపోయిన వారిని పరిశీలిస్తే తల్లిదండ్రులు, సమాజం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్టు వెల్లడవుతోందన్నారు. మోసపోయిన వారిలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారేనని, చిన్నపాటి బైకుపై తిరగడం..హోటల్స్‌కు వెళ్లడం వంటి చిన్నపాటి కోరికలకు వీరు లొంగిపోయారన్నారు. ఆ తర్వాత నిందితులు డబ్బులు కావాలంటే వంటిపై ఉన్న గొలుసులు, చెవి రింగులు కూడా ఇచ్చారన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రశంసలు
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రహస్య విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు టీమును పోలీసు కమిషనర్ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు నక్కా సూర్యచంద్రరావు, కె.లావణ్యలక్ష్మీ, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.