నేడు ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం | AU Old Student Meeting With Rathan Tata | Sakshi
Sakshi News home page

నేడు ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం

Published Mon, Dec 10 2018 12:38 PM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

AU Old Student Meeting With Rathan Tata - Sakshi

ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి (వేవ్స్‌–2018) బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ కేంద్రం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా హాజరుకానున్నారు. ఈయన రాకతో సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ఉదయం ప్రతీ విభాగంలో ఆయా విభాగాల పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు. సాయంత్రం 4.45 గంటలకు రతన్‌ టాటా కన్వెన్షన్‌ సెంటర్‌కు విచ్చేసి వేవ్స్‌ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు.

అ‘పూర్వ’ సహకారం
ఘన చరిత గల విశ్వవిద్యాలయాన్ని మరింత వృద్ధి చేసేందుకు అపూర్వ సహకారం అందిస్తున్నారు పూర్వ విద్యార్థులు.
ఇంజినీరింగ్‌ విద్యార్థుల జ్ఞాపిక: ఏయూ హాస్పిటల్‌ : ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఉత్తర ప్రాంగణంలో 1981–85 బ్యాచ్‌ విద్యార్థులు వైద్యశాలను నిర్మించి అందించారు. రెండు అంతస్తుల్లో వైద్యసేవలు, ఎక్స్‌రే, ఫార్మసీ వంటి సేవలు అందించేలా దాదాపు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.75లక్షలతో భవనాన్ని నిర్మించి వర్సిటీకి కానుకగా అందించారు.
మైకేల్‌ స్మతిచిహ్నం ఫార్మసీ భవనం : ఏయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి తాటికొండ కృపాకర్‌ పాల్‌ తన కుమారుడు మైకేల్‌ జ్ఞాపకార్థం రూ.5కోట్లతో నూతన భవనాన్ని అందించారు. పురాతన రాతి భవనాన్ని

తలపించేలా దీనిని నిర్మించారు.
జీఎంఆర్‌ : వ్యాపార దిగ్గజం గ్రంథి మల్లికార్జునరావు ఏయూ టీచర్స్‌ అసోసియేషన్‌కు సొంత భవనాన్ని నిర్మించారు. ఆచార్య బీల సత్యనారాయణ వీసీగా ఉన్న సమయంలో జీఎంఆర్‌ రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఏయూ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయం పైభాగంలో ఆపూస కార్యాలయాన్ని ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు. దీనికి అదనంగా స్మార్ట్‌ సెమినార్‌ హాల్, మల్టీ పర్పస్‌ హాల్‌ను రూ 50 లక్షలు వ్యయంతో నిర్మించారు. అదే విధంగా సంఘానికి రూ. కోటి నిధులను అందించారు.
తండ్రి కానుకగా ఆడిటోరియం అందించిన వైవీఆర్‌ : ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ పూర్వవిద్యార్థి వై.వి.ఎస్‌ మూర్తి వర్సిటీకి రూ.50 లక్షలు అందించాలని భావించారు. ఆ కోరికను తీర్చారు ఆయన కుమారుడు వై.వెంకటరావు. రూ 2 కోట్ల వ్యయంతో మూడు వందల మంది పట్టే విధంగా వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంను బహుమతిగా అందజేశారు.  

మరెందరో స్ఫూర్తిప్ర‘దాతలు’
పారిశ్రామిక వేత్త కుమార్‌రాజా తాను చదువుకున్న మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రూ. 10 లక్షలతో డిజిటల్‌ తరగతిని ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి మరో తరగతి గదిని అందించారు.
కామర్స్‌ విభాగం 1983–85 బ్యాచ్‌ ఎంబీఏ విద్యార్థులు సమావేశ మందిరాన్ని ఆధునికీకరించారు. దీనికి రూ. 10 లక్షల వరకు వెచ్చించారు.
కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 1966–71 బ్యాచ్‌ విద్యార్థులు 8.5 లక్షలతో వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ను అభివృద్ధి చేశారు
ఏయూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు విశ్రాంత ఆచార్యురాలు సహాయం అందించారు.
సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగ పూర్వవిద్యార్థులు విభాగ విద్యార్థినులకు ఉపయుక్తంగా అవసరమైన భవనాన్ని, వసతులను నిర్మించి అందించారు.

కట్టమంచి దత్తపుత్రికలా..ఆవిర్భవించిందిలా..
‘మనం పేదవాళ్లం కావచ్చు, బిచ్చగాళ్లం కానవసరం లేదు’ అని చెప్పేవారట కట్టమంచి రామలింగారెడ్డి. అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో ప్రత్యేక విశ్వవిద్యాలయం కోసం నాటి పాలకులతో పోరాటమే చేశారాయన. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వంపై పలుమార్లు తెచ్చిన ఒత్తిడి  ఫలితంగా వారు అంగీకరించక తప్పలేదు. ఆయన కృషి ఫలితంగా .. మానస పుత్రికలా అంకురార్పణ జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి.. 1926 ఏప్రిల్‌ 26న తమ కలల సాకారంగా ఆవిర్భవించిన ఏయూను అభివృద్ధి చేసే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్న కట్టమంచి తన వేతనం రూ. 2 వేలలో సగాన్ని వర్సిటీ అభివృద్ధికి విరాళంగా అందించేవారు. దేశాభివృద్ధికి ఉపకరించే విలువైన మానవ వనరులను తయారు చేయాలని నిరంతరం పరితపించేవా రు. ఈ ప్రక్రియలో ఉపకులపతి పదవిని తృణ ప్రాయంగా త్యజించి..  సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను వీసీగా తీసుకువచ్చారు. సర్వేపల్లి అనంతరం రెండో పర్యాయం ఉపకులపతిగా పనిచేసిన కట్టమంచి ఏయూ ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తిచేశారు. విశ్వవిద్యాలయం బోధన నియామకాలలో కేవలం ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చి విభిన్న  ప్రాంతాల నిపుణులకు స్థానం కల్పించారు.

మేధావుల నిలయం
ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ, న్యాయ శాస్త్ర కోవిదులను అందించింది. తత్వశాస్త్రం, ప్రభుత్వ పాలన, రాజనీతి శాస్త్రం, హిందీ, పారా సైకాలజీ విభాగాలకు చెందిన ఆచార్యులు పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్‌ అవార్డులను అందుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా పనిచేశారు. క్రీడల్లో అత్యుత్తమ స్థానాలను అందుకోవడం, పరిపాలనా పరంగా రాణించడం జరిగింది. రాజకీయ రంగంలో రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, పార్లమెంట్‌ స్పీకర్‌గా ఏయూ పూర్వవిద్యార్థులు పనిచేయడం వర్సిటీకి నూతన చరిత్రను ఆపాదించాయి. శాస్త్ర పరిశోధన రంగానికి నిపుణులను, శాస్త్రవేత్తలను అందించింది. షార్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఏయూ విద్యార్థులు నేడు పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అణుశాస్త్ర వికాసానికి ఎంతో దోహదం చేసింది. అణుభౌతిక శాస్త్రం, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ వంటి వి భా గాలు దూరదృష్టితో ప్రారంభించబడి దేశానికి మేధావుల కొరత రాకుండా చూస్తున్నాయి.

భౌగోళికంగానూ ప్రత్యేకమే..
ఎదురుగా ఉవ్వెత్తున ఎగసి పడే సముద్ర కెరటాలు.. మరో వైపు నిశ్చలంగా దర్శనమిచ్చే పర్వత శ్రేణి. ఈ రెంటికి నడుమ విశాల ప్రాంగణంలో నెలవైన ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఈ భౌగోళిక స్వరూపమూ యువతకు ఓ సందేశాన్నిస్తున్నట్లుగా ఉంటుంది. కెరటంలా ఉవ్వెత్తున ఎగిసే అనంత శక్తిని తనలో నింపుకొని వచ్చిన యువతను తొణకని, బెణకని మేరు శిఖరంలా మలచే, మేధావిగా తీర్చిదిద్దే విద్యానిలయంగా వర్థిల్లాలనే ఆకాంక్ష నిబిడీకృతమైనట్లు కనిపిస్తుంది. ఇటువంటి రెండు విభిన్న ప్రాంతాల మధ్య నెలకొన్న విశ్వవిద్యాలయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. దీనిని గుర్తించి, ఇక్కడ ఏర్పాటు చేసిన కట్టమంచి మరెంతో మహోన్నతుడు.

స్ఫూర్తిప్రదాత రాజా విక్రమ్‌దేవ్‌ వర్మ
వర్సిటీకి విలువైన భూములు, నిధులను అందించారు  జైపూర్‌ సంస్థానాధీశులు. విశ్వవిద్యాలయానికి మూడు వందల ఎకరాల వరకు భూములతో పాటు భౌతిక శాస్త్రవిభాగాన్ని అందించారు రాజా విక్రమ్‌ దేవ్‌వర్మ. ఉన్నత విద్యావంతుడైన రాజా విక్రమదేవ్‌ వర్మ సైన్స్‌ కళాశాల భవనాలను నిర్మించడమే కాకుండా విశ్వవిద్యాలయం నిర్వహణకు ఏడాదికి లక్ష రూపాలను ప్రతీ సంవత్సరం వర్సిటీకి అందించేవారు. నాటి రోజుల్లో లక్ష రూపాయలు నేటి కోట్లకు సమానం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement