కడప అగ్రికల్చర్ : రైతులకు సేవలందించి ఉన్నతంగా నిలవాల్సిన ఆగ్రోస్ సంస్థ అబాసు పాలవుతోంది. జిల్లా ఆగ్రోస్ సంస్థ పరిధిలో నడుస్తున్న రైతుసేవా కేంద్రాలలో కొన్ని కేంద్రాలు ఏపీ సీడ్స్ సంస్థకు ఏళ్ల తరబడి మొండి బకాయిలున్నాయి. దీనిపై అనేక సార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా లాభం లేకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయిస్తున్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని తొమ్మిది ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాలు దాదాపు రూ.61.21 ల క్షల మొండి బకాయిలున్నాయి. ఈ బకాయిలు రాబట్టుకోవడానికి ఆయా కేంద్రాల వద్దకు ఏపీ సీడ్స్ అధికారులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
నోటీసులు పంపినా...
ఏపీ సీడ్స్ సంస్థ జిల్లా అధికారులు చివరకు నోటీసులు పంపినా ఉలుకూపలుకూ లేదు. దీంతో ఏళ్లు గడుస్తుడడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన సరఫరా సంస్థ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు పలుసార్లు రాష్ట్రస్థాయి సమావేశాల్లో బకాయిల విషయమై ఏం చేశారని ప్రశ్నించడం, ఇక్కడి నుంచి వెళ్లిన అధికారులు ఏదో ఒక సమాధానం చెబుతూ వచ్చారు. ఇక లాభం లేదని, నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయని గుర్తించి రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేదేమిలేక జిల్లాలో ఏఏ రైతు సేవా కేంద్రాలు మొండి బకాయి ఉన్నాయో జాబితాను తయారు చేసి డిమాండ్ నోటీసులు పంపారు. ఆ నోటీసులకు బకాయిదారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆఖరు అస్త్రంగా కోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏఏ కేంద్రం ఎంతెంత బకాయి ఉందో, ఎప్పటి నుంచి ఉందో మొత్తం లెక్కా పత్రాలు సిద్ధం చేసి మంగళవారం న్యాయవాదిని జిల్లా ఏపీ సీడ్స్ అధికారులు సంప్రదించారు. జిల్లా ఏపీ సీడ్స్ సంస్థకు తొమ్మిది రైతుసేవా కేంద్రాలు రూ. 61.21 లక్షల బకాయిలు ఉన్నట్లు తేల్చారు. ఆయా కేంద్రాలపై కోర్టులో కేసు దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.
కోర్టును ఆశ్రయించక తప్పడం లేదు...
మొండి బకాయిలు రాబట్టడడం లేదని రాష్ట్ర సంస్థ అధికారులు గట్టిగా చెప్పారని సంస్థ ఉద్యోగి తెలిపారు. రాష్ట్రస్థాయి జిల్లా మేనేజర్ల సమావేశంలో ఒక్కో మేనేజర్‌ను నిలబెట్టి గట్టిగా నిలదీస్తున్నారు. ఏం చేస్తారో మాకు తెలియదు మొండి బకాయి రాబట్టకపోతే మీకు రావాల్సిన అన్ని సౌకర్యాలు కట్ చేస్తామని హెచ్చరించారు. కోర్టును ఆశ్రయించి రాబట్టాలని కోర్టు ఫీజులు కూడా మంజూరు చేశారు. ఇక ఉపేక్షించడానికి కుదరదు.
ఆగ్రోస్.... అప్పు
Published Wed, Dec 3 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement