అగస్టా కేసులో నరసింహన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ | Augusta deal: CBI to examine Andhra Governor ESL Narasimhan | Sakshi
Sakshi News home page

అగస్టా కేసులో నరసింహన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

Published Wed, Jul 9 2014 1:45 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

అగస్టా కేసులో నరసింహన్‌ను  ప్రశ్నించనున్న సీబీఐ - Sakshi

అగస్టా కేసులో నరసింహన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

హైదరాబాద్: అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో సాక్షిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి సీబీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఆయన వాంగ్మూలం రికార్డు చేస్తారని వార్తలొచ్చినప్పటికీ బుధ వారమే ఆయన్ను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నాయి. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటివరకు ఇద్దరు గవర్నర్లను విచారించగా నరసింహన్ మూడో వ్యక్తి అవుతారు. 3,700 కోట్ల రూపాయలకుపైబడి ఈ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎంకె నారాయణన్, గోవా మాజీ గవర్నర్ వాంఛూలను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ వల్లే వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా వాంఛూ ఎస్‌పీజీ చీఫ్‌గా కొనసాగుతున్నారు.

2005 లో ఈ ఒప్పందం కుదిరినప్పుడు నరసింహన్ కేంద్ర ఐబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2005 మార్చి ఒకటిన జరిగిన కీలక సమావేశంలో వీరిచ్చిన నివేదికలు కీలకమయ్యాయని సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్‌పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆనాడు జరిగిన వ్యవహారాలపై నరసింహన్‌ను సీబీఐ ప్రశ్నించవచ్చు. నరసింహన్‌ను కీలక సాక్షిగా సీబీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, గవర్నర్లను తప్పించాలన్న ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఒత్తిడి పెంచడానికే ఈ రకంగా చేస్తున్నట్టు నరసింహన్ సన్నిహితులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement