ఆటోను ఢీకొన్న ‘కంటైనర్’
Published Thu, Oct 31 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
రావులపాడు (రావులపాలెం), న్యూస్‌లైన్ :పుట్టిన రోజు కోసం కుమారుడికి దుస్తులు కొనేందుకు మార్కెట్‌కు బయలుదేరిన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాద సంఘటన ఇది. బుధవారం రావులపాలెం మండలం రావులపాడులో ఆటోను కంటైనర్ లారీ ఢీకొన్న సంఘటనలో ఇదే గ్రామంలోని మల్లాయిదొడ్డికి చెందిన శీలం లక్ష్మి(30) మరణించింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం మార్కెట్‌లో తన బిడ్డకు దుస్తులు కొనేందుకు శీలం లక్ష్మి ఐదేళ్ల కుమారుడు సతీష్‌తో కలిసి స్థానిక సెంటరులో ఆటో ఎక్కింది.
జాతీయ రహదారిపై లక్ష్మీ పోలవరానికి వెళ్లే సెంటరు వద్దకు ఆటో చేరుకునేసరికి వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొంది. ఆటో నుంచి లక్ష్మి కిందపడడంతో లారీ ఆమెను కొంతదూరం ఈడ్చుకుపోయింది. ఆమె లారీ వెనుకచక్రం కిందపడడంతో తల చర్మం ఊడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారుడు సతీష్ సురక్షితంగా ఉన్నా డు. ఇదే ప్రమాదంలో ఆ టోలో ప్రయాణిస్తున్న గో పాలపురం గ్రామానికి చెం దిన పితాని వెంకటలక్ష్మి, మాదే అబద్దం, రావులపాలేనికి చెందిన మల్లిడి లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
హైవేపై గుంతలే కారణం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిలో అనేకచోట్ల భారీ గుంతలు పడ్డాయి. హైవే అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట జాతీయ రహదారిలో పెద్ద గొయ్యి పడింది. వాహ నాలు అందులో పడకుండా ఉండేందుకు బారికేడ్‌ను అడ్డంగా ఉంచారు. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఆ గొయ్యిని తప్పించే క్రమంలో అదుపుతప్పడంతో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొందని స్థానికులు తెలిపారు.
శోకసంద్రంలో మృతురాలి కుటుంబం
మనవడి పుట్టిన రోజున దుస్తులు కొనేందుకు వెళ్లిన కోడలు.. తిరిగిరానికి లోకానికి వెళ్లిపోయిందని మృతురాలి అత్త మంగాయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. వ్యవసాయ కూలీ అయిన తన కుమారుడు పొరుగు ఊరికి పనికి వెళ్లాడని, అతడు వచ్చి అడిగితే తానేమి సమాధానం చెప్పాలంటూ మంగాయమ్మ విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. అడిషనల్ ఎస్సై ఎంఏ బాబూరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు
Advertisement