టోకెన్ లేకపోతే ఆటో బయటకు వెళ్లదు
బస్‌స్టాండ్ ఆటోలకు రికార్డులన్నీ ఉండాలి
ఈ విధానానికి ప్రజలూ సహకరించాలి ఏసీపీ చిదానందరెడ్డి
బస్‌స్టేషన్ : పోలీస్ ఇచ్చే టోకెన్ లేకపోతే ప్రయాణికులతో ఉండే ఆటో బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఏసీపీ(ట్రాఫిక్) చిదానందరెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నగరం రాజధాని అయిన నేపథ్యంలో పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌లో ఆటో ప్రీపెయిడ్ కంప్యూటరీకరణ చేయనున్న విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం ఆటో కార్మికులు, ఆటోస్టాండ్ తీరును ఏసీపీ స్వయంగా పరిశీలించారు. పలు ఆటోల రికార్డులను తనిఖీ చేశారు. కంప్యూటరీకరణ విధానాన్ని కృష్ణా సాఫ్ట్‌వేర్ సంస్థకు అప్పగించడంతో వారు కంప్యూటర్‌కు కెమెరాను అనుసంధానం చేసే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఆటో కార్మికునికి వాహనం రిజస్ట్రేషన్ చేసి ఉండటమే కాకుండా డ్రైవింగ్ లెసైన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అన్ని రికార్డులు ఉన్న ఆటోలను కంప్యూటరీకరణ విధానంలో ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు. కంప్యూటర్‌లో డ్రైవర్ ఫొటో, వాహనం వివరాలు పొందుపరచడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ విధానంలో ఉన్న ఆటోలకు టోకెన్ ఇవ్వడం జరుగుతుందని, ఆ టోకెన్‌ను బయటకు వెళ్లే మార్గం దగ్గర ఉన్న విధులు నిర్వహిస్తున్న పోలీసుకు చూపితేనే ఆటో బయటకు వెళుతుందని తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. పోలీసుల విధివిధానాలకు అనుగుణంగా నడుచుకుంటేనే భద్రతమైన ప్రయాణంతోపాటు పూర్తిగా క్రైం రేటు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.