మెట్ట జిల్లాల్లో విరగ్గాసిన ఖర్జూరం
భూ నైసర్గిక స్వరూపంతో పాటు సాగునీటి వనరుల దృష్ణ్యా మెట్ట ప్రాంత రైతులకు నిమ్మసాగు అనివార్యమైంది. ధరల ఆటు పోటులతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా.. ఈ భూముల్లో ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక పంట మరొకటి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖర్జూరం సాగుకు ఈ ప్రాంత భూములు అనుకూలమేనని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దీంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖర్జూరం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తే సిరులు పండించవచ్చు.
గూడూరు (నెల్లూరు): జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాలైన గూడూరు, చిల్లకూరు, సైదాపురం, డక్కిలి, ఓజిలి, బాలాయపల్లి, వెంకటగిరి, పొదలకూరు, రాపూరు, చేజర్ల తదితర మండలాల్లో ప్రస్తుతం సుమారు 25 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. నిమ్మ సాగు చేయాలంటే ఫలసాయం కోసం నాలుగు నుంచి ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాగు చేసి, కాపుకొచ్చే సమయంలో ధరలు ఉండక రైతులు అప్పులపావుతున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో నీటి వనరులు, భూముల పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ పంటలు లేక నిమ్మ సాగే అనివార్యమైంది. ఇదే నీటి వనరులు ఉన్న కరువు సీమలైన ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని నల్గొండ జిల్లాల్లోని ఎందుకూ, ఏ పంట సాగుకూ పనికిరాని చవుడు భూముల్లో సైతం ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం సాగు చేస్తూ రైతులు లాభాల బాటన నడుస్తున్నారు.
పెట్టుబడులు అధికమే.. నాలుగేళ్లకే దిగుబడులు
నిమ్మ పంటతో పోల్చితే ఖర్జూరం కూడా ఫలసాయం సమయం దాదాపు సమానంగానే ఉంది. టిష్యూ రకం నిమ్మ మొలక సుమారు రూ.10 మాత్రమే ఉంటుంది. కానీ ఖర్జూరం మొక్క అయితే మాత్రం టిష్యూ రకం ఒక్కొక్కటి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ ఉంటుంది. అదే తరహాలో ఫల సాయం కూడా వస్తున్నట్లు సాగు చేసిన రైతులు చెబుతున్నారు. మొక్కల కొనుగోలుతో పాటు భూమిని చదును చేయడం, డ్రిప్, ఎరువులు, కూలీలు ఇతర ఖర్చులకు ప్రారంభంలో ఎకరాకు రూ.5 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి ఉంది.
రెండో సంవత్సరం నుంచి కూడా ఏడాదికి ఎకరానికి సుమారు రూ. లక్ష లోపే ఉంటుంది. నాటిన నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి కూడా ఎకరానికి ఏడాదికి సుమారు రూ. 4 లక్షలకు పైగానే ఆదాయం 40 నుంచి 50 ఏళ్ల వరకూ ఫలసాయం అందుకోవచ్చని సాగు చేస్తున్న రైతులే అంటున్నారు. ఎకరానికి 60 నుంచి 80 వరకూ మొక్కలు నాటాలి. వాటిలో కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూరం మొక్కలుండేలా చూసుకోవాల్సి ఉంది. మూడేళ్ల పాటు జాగ్రత్తగా మొక్కలను నాలుగో ఏట కాపునకు వస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ పైన, మార్చి 15వ తేదీ లోపుగా చెట్లు పూత దశకు వస్తాయి. ఈ క్రమంలో పూతకు నెల ముందుగా నీటిని పెట్టకుండా ఆపేయాలి. అప్పుడే వాడి పూత ఎక్కువగా పూసే వీలుంటుంది.
టన్ను ఖర్జూరం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ
ఎకరం ఖర్జూరం సాగు చేస్తే నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి కనిష్టంగా 3.5 టన్నుల నుంచి గరిష్టంగా 5 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. దీంతో ఫల సాయం సుమారు ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్జూరం సాగు చేస్తే హెక్టారుకు రూ. 2 లక్షల రాయితీ ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
చవుడు భూములు ఖర్జూరం సాగుకు అనువే
నల్గొండ ప్రాంతంలో ఎందుకూ పనికిరాని చవుడు భూముల్లో కూడా ఖర్జూరం సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. చవుడు భూముల్లో ఈత మొక్కలు మొలిచి ఉండడాన్ని గుర్తించిన రైతు, అక్కడి రైతులు కూడా విస్మయం చెందేలా ఫలసాయాన్ని పొందుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
అవగాహన కల్పిస్తే మంచిది
నేను 3 ఎకరాల్లో నిమ్మ తోట సాగుచేస్తున్నా. ఈ ఏడాది పెట్టుబడి, నీటి వసతి కోసం బోర్లు వేసేందుకు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాది రూ.2 లక్షల వరకూ నష్టపోయా. అవగాహన కల్పించి సాగుకు రాయితీలు ఇస్తే ఖర్జూరం సాగు చేస్తాం. – ఎన్.పెంచలయ్య, రైతు, అక్కమాంబాపురం, రాపూరు మండలం
ప్రత్యామ్నాయ పంటలే దిక్కు
నిమ్మ తోటలకు ప్రత్యామ్నాయ పంట వస్తే నిమ్మ రైతులందరూ ముందుకొస్తారు. మెట్ట ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తే ఖర్జూరం వంటి పంటలు సాగు చేపడుతాం. – కె.పెంచలనరసయ్య, రైతు, చీకవోలు, సైదాపురం మండలం
ప్రోత్సాహం అందిస్తే సాగు చేస్తాం
డ్రిప్‌కు రాయితీతో పాటు, బోర్లు వేయడంతో పాటు, ఇతర ఖర్చులకు కూడా ప్రభుత్వం రుణాలు అందజేస్తే ఖర్జూరం సాగుకు సిద్ధమవుతాం. ప్రయోగం చేయాలంటే అది ముందుగా ఉద్యాన శాఖ ద్వారా జరిగితేనే మంచిది. – జి.భాస్కర్‌రెడ్డి, రైతు, వెడిచర్ల గూడూరు మండలం
సాగుకు సిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు
జిల్లాలోని భూములు కూడా ఖర్జూరానికి అనువైనవే. ఎవరైనా రైతులు ఖర్జూరం సాగు చేసేందుకు సంసిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు పంపుతాం. రైతులు ముందుకు వస్తే శాఖా పరమైన సహకారం అందజేస్తాం. – అనురాధ, ఉద్యాన శాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment