
లబ్బీపేట(విజయవాడతూర్పు): అందరూ ఆరోగ్యంగా జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వయస్సు 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జనాభాలో 37 శాతం మంది 30 ఏళ్లు దాటిన వారు ఉన్నట్లు గుర్తించగా సుమారు 16 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయనున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్స్‌తో పాటు, పట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలు అక్టోబరు 2 వరకూ కొనసాగనున్నాయి.
వ్యాధుల నిర్థారణ..
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్స్‌లో మధుమేహం(సుగర్), బీపీ(రక్తపోటు) క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్‌పరీక్షలు నిర్వహించనున్నారు. వాటితో పాటు పోగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నోటి క్యాన్సర్, ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యం వల్ల కలిగే వ్యాధుల నిర్థారణ, చెవి ముక్కు, గొంతు సమస్యలు, దంత వ్యాధుల నిర్థారణకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. వాటితో పాటు హార్మోనల్ డిసీజెస్(థైరాయిడ్), కంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులకు నిర్థారణ పరీక్షలు చేస్తారు. వాటితో పాటు టీబీ, లెప్రసీ, జ్వరాలపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయనున్నారు. ఆరోగ్య కార్యకర్తలతో పా టు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్‌లను ప్రజల ను తీసుకు వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంలో తమవంతు పాత్ర వహించనున్నారు.
గుండె స్క్రీనింగ్ పరీక్షలు..
ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 29 వరకూ జిల్లాలోని అన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రిల్లో గుండె జబ్బులకు సంబంధించి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో గుండె వ్యాధులు ఉన్నట్లు గుర్తించిన వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు. అంతేకాకుండా ఈ నెల 29 ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండెజబ్బులకు గురై, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొంది ఆరోగ్యంగా ఉన్న వారిని సత్కరించడంతో పాటు, వారి అనుభవాలను ప్రజలకు తెలియచేసి అవగాహన కలిగించనున్నారు.
వృద్ధులకు ప్రత్యేక వార్డులు..
వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబరు 1న విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిల్లో 10 పడకల చొప్పున ప్రత్యేక వార్డులను ప్రారంభించనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రిల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ వార్డులను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రిల్లో చికిత్సకోసం వచ్చిన 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రత్యే క్యూలైన్‌లు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. రక్తపరీక్షలు, వైద్య పరీక్షలు, ఫార్మసీ ఇలా అన్ని చోట్ల వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
పాఠశాల విద్యార్థులకు పోటీలు..
వ్యాధులకు చిన్నారులకు అవగాహన కలిగించేందుకు జిల్లాలోని పలు పాఠశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆరోగ్యకరమైన జీవనం, దీర్ఘకాలిక వ్యాధుల వంటి అంశాలతో ఈ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అక్టోబరు 2న బహుమతులు అందజేయనున్నారు.
జిల్లా అంతటా స్క్రీనింగ్ పరీక్షలు..
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఆరోగ్యం పేరిట జిల్లా అంతటా వయస్సు 30ఏళ్లు దాటిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్‌లలో ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. మధుమేహం, రక్తపోటుతో పాటు, క్యాన్సర్, ఈఎన్‌టీ, డెంటల్ స్క్రీనింగ్, హార్మోనల్ డిసీజ్, గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్యం అవసరమైన వారికి విజయవాడ, మచిలీపట్నం ఆస్పత్రులకు తరలిస్తాం. వృద్ధుల కోసం విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో 10 పడకలతో వార్డులు ఏర్పాటు చేయనున్నాం.– డాక్టర్ జె. ఉషారాణి,జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాకాధికారి
Comments
Please login to add a commentAdd a comment