బాబు డైలమా!  | Babu Dilemma! | Sakshi
Sakshi News home page

బాబు డైలమా! 

Published Sun, Mar 17 2019 9:01 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Babu Dilemma! - Sakshi

ఎన్నికల వేళ టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. టీడీపీకి ‘అనంత’  కంచుకోట అంటూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అభ్యర్థులను మాత్రం ఎంపిక చేయలేక సతమతమవుతున్నాడు. నామినేషన్‌ స్వీకరణ రోజు సమీపిస్తున్నా బరిలో నిలిచే వారిని ప్రకటించలేకపోతున్నారు. ఎంపీ జేసీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేక.. సొంత నిర్ణయంపై మొగ్గుచూపలేక సందిగ్ధంలో పడిపోయారు. మరోవైపు కళ్యాణదుర్గం టిక్కెట్‌పై ఇటు ఉన్నం, అటు అమిలినేని ఆశలు పెంచుకున్నారు. ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఇక గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనమాట నెగ్గించుకునేందుకు బ్లాక్‌మెయిల్‌కు కూడా దిగారు. సిట్టింగ్‌లను మార్చి తాను చెప్పిన వారికే టిక్కెట్లు కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే జేసీ సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు ఇస్తే పార్లమెంట్‌ పరిధిలో జేసీ తనకంటూ ప్రత్యేక వర్గం ఏర్చరుచుకుంటారనీ, ఇది పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందనే యోచనలో పార్టీ ఉంది. అందుకే జేసీ సిఫార్సులపై ఆచితూచి అడుగేయాలనే భావనలో బాబు ఉన్నారు.  

మళ్లీ మొదటికొచ్చిన కళ్యాణదుర్గం పంచాయితీ 
జేసీ సిఫార్సు చేసిన మూడు ప్రధాన నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి సిద్ధమయ్యారు. సోమవారం నామినేషన్‌ వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఇక కళ్యాణదుర్గం అభ్యర్థిత్వంపై అమిలినేని సురేంద్రకు టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో సురేంద్ర నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. ఈ క్రమంలో చౌదరి నామినేషన్‌ వేస్తానని ప్రకటించడంతో సురేంద్రలో గుబులు మొదలైంది. దీనికి తోడు జేసీ దివాకర్‌రెడ్డి కూడా సురేంద్రను వ్యతిరేకిస్తున్నారు. బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరనాయుడు పేరు ఖరారు చేయాలని చంద్రబాబు వద్ద పట్టుబడుతున్నారు. మరోవైపు చౌదరి వర్గం మాత్రం ఉమా, సురేంద్ర స్థానికేతులరని.. వీరిద్దరికీ కాకుండా తమలో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్టానానికి స్పష్టం చేశారు. తద్వారా ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నామని బాహాటంగానే చెప్పారు.  


చౌదరికి ఎసరు పెట్టాలనీ.. 
ఎంపీ జేసీ కళ్యాణదుర్గం టిక్కెట్‌ ఉమాకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో అది తెలుసుకున్న అమిలినేని సురేంద్ర, జేసీతో మాట్లాడినట్లు తెలిసింది. తన అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. కావాలంటే అనంతపురం అర్బన్‌కు వెళ్లాలని, సీఎంకు కూడా తాను సిఫార్సు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌చౌదరిని మార్చాలని ముందు నుంచి దివాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద తన వాణి వినిపిస్తున్నారు. మరోవైపు చౌదరి ఏకంగా ప్రచారం సాగిస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రభాకర్‌ చౌదరిని వదులుకోకూడదని చంద్రబాబుకు టీడీ జానార్దన్‌తో పాటు మంత్రి దేవినేని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు బ్రేక్‌ వేయాలంటే  కచ్చితంగా చౌదరి ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపే జేసీ, మాజీ ఎంపీ సైఫుల్లా వర్గంతో పాటు బలిజ, కమ్మ సామాజికవర్గ నేతలు కూడా చౌదరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

చౌదరికి టిక్కెట్‌ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని సర్వే రిపోర్టులు కూడా రావడంతో చంద్రబాబు కూడా డైలమాలో ఉన్నట్లు సమాచారం. దీంతో సురేంద్ర పేరును అనంతపురం నియోజకవర్గానికి కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను చెప్పిన స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోతే ఎంపీగా తాము బరిలోకి దిగమని కూడా జేసీ బాహాటంగానే చెబుతున్నారు. ఇంత నేరుగా అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న జేసీ తీరుతో ‘అనంత’ నేతలు కూడా విస్తుపోతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో పార్టీకి జేసీనే మైనస్‌ కాబోతున్నారని, పవన్‌ ఎంపీగా ఓడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో మరొకరిని బరిలోకి దించితే ఎంపీగా ఓడిపోయినా కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇవ్వగలమనే అభిప్రాయాన్ని మంత్రి దేవినేనికి కొందరు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. 


జితేంద్రగౌడ్‌ వైపే మొగ్గు 
ఇక గుంతకల్లు స్థానాన్ని జితేంద్రగౌడ్‌కే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా పార్లమెంట్‌ అభ్యర్థినే బీసీని బరిలోకి దించుతోందని.. టీడీపీ తరఫున పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాలవ మినహా మరో బీసీ నేత లేరని, గౌడ్‌ను తప్పిస్తే అంతా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ రెండు పార్లమెంట్‌ సీట్లూ తలారి పీడీ రంగయ్య, గోరంట్ల మాధవ్‌కు కేటాయించడంతో టీడీపీ బలమైన బీసీ ఓటు బ్యాంకు దారి మళ్లిందని, ఇది పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు జేసీ మాత్రం గౌడ్‌ను తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో ‘అనంత’ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సీట్లపై చంద్రబాబు తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. రెండో జాబితా ప్రకటిస్తే అందులోనూ ‘అనంత’ పార్లమెంట్‌లోని స్థానాలు లేకపోతే బాగుండదని జాబితాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement