ప్రజాసమస్యలు గాలికొదిలి మైండ్‌గేమ్‌లా?
బాబుపై ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట ధ్వజం
హైదరాబాద్: ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు ఏమాత్రం ఫలించవని, ఇక మీదట రోజురోజుకూ బలహీనపడేది తెలుగుదేశం పార్టీయేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీడీపీ ప్రలోభాలకు లొంగి ఒకరిద్దరు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ బలహీనపడదని సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు... తమ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేలా ‘మైండ్ గేమ్’ ఆడటం సరికాదన్నారు.
‘‘ఎన్నికల ముందు ఇచ్చిన సాధ్యం కాని హామీలను చంద్రబాబు నెరవేర్చకపోతే ఆరు నెలల్లో టీడీపీలోని వాళ్లే ఇతర పార్టీల వైపు చూడాల్సి వస్తుంది. ఓవైపు విభజన వల్ల తలెత్తిన స్థానికత సమస్యతో విద్యార్థులు, ఉద్యోగులు సతమతమవుతున్నారు. మరోవైపు రాజధాని ఎక్కడో, ఏ ఆఫీసు ఎక్కడుంటాయో తెలియని స్థితిలో ప్రజలుంటే బాబు వాటిని పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. రుణాల మాఫీ వంటి వాటిపై తొలి సంతకం చేయాల్సి వస్తుందనే భయంతోనే.. పార్టీ గెలిచినా ప్రమాణ స్వీకారం చేసే తేదీని బాబు నిర్ణయించుకోలేదు’’ అని దుయ్యబట్టారు. రాజకీయ డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.