భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చెందిన ఉద్యోగి ఒకరు మద్యం మత్తులో ఉండగా ఆలయ ఈఓ గురువారం రాత్రి గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతిని కల్పించే సీఆర్‌ఓ కార్యాలయానికి పక్కనే ఉన్న సౌమిత్రి సదనంలో రమేష్ అలియాస్ బాబా అనే ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం సదనంలోని గదుల్లో బెడ్‌షీట్స్ సరిగా లేవని, వాటిన మార్చాలని భక్తులు పలుమార్లు కోరినా ఆ ఉద్యోగి స్పందించలేదు. దీంతో వారు ఆలయ ఈఓ రఘునాధ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈఓ హుటాహుటీన సత్రానికి వచ్చి పరిశీలించగా ఆ ఉద్యోగి ఓ గదిలో మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఈఓ ఆ ఉద్యోగిని మెడికల్‌టెస్ట్‌ల కోసం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని దేవస్థాన పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో అదే గదిలో మద్యం సీసాలు కూడా దొరికినట్లు సమాచారం.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ.....
దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఈ సంఘటనతో మరోసారి నిరూపితమైంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ గురువారం సాక్షాత్తు దేవస్థాన ఉద్యోగే మద్యం మత్తులో ఈవోకు పట్టుబడటం గమనార్హం. ఇటీవలే కళ్యాణ మండపానికి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణాలయానికి చెందిన అద్దె గదులలో ప్రైవేటు ఉద్యోగులు మద్యం సేవిస్తూ దసరా రోజున స్థానికులకు పట్టుబడ్డారు. ఇటువంటి సంఘటనలతో పాటు గుట్టపై నున్న సత్రాలతో పాటు, దేవస్థాన గదులలో అసాంఘిక కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయని సమాచారం. వీటిపై గతంలో ఫిర్యాదులు చేసినా దేవస్థాన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఇటువంటి పనులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ ఈఓ, అధికారులు దేవస్థాన సత్రాలపై నిఘాను పెంచి భరోసా కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
మద్యం మత్తులో దేవస్థానం ఉద్యోగి..
Published Fri, Nov 8 2013 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement