మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ముస్లిం సోదరులు త్యాగాలకు ప్రతీకగా భావించే బక్రీద్ (ఈదుల్ జుహా) వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌తో పాటు గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, ఆలంపూర్, దేవరకద్ర, మక్తల్, కొత్తకోట తదితర పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
జిల్లాకేంద్రంలోని వానగుట్టపై ఉన్న రహెమానియా ఈద్గా మైదానంలోపెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. జామె మసీద్ ప్రధాన ఇమామ్ మౌలానా అబ్దుల్ కరీమ్ సాబ్ ఉదయం 9 గంటలకు ప్రత్యేక నమాజ్ చేయించారు. బక్రీద్ ప్రత్యేకతను ఖుత్‌బా రూపంలో వివరించి, దైవకృప కోసం పవిత్ర ఖురాన్ గ్రంథంలోని సందేశాలతో పాటు ప్రవ క్త మహ్మద్ అలైహివసల్లమ్ ఆచరించిన ధర్మమార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర సమాచార మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు ఈద్గాల వద్ద ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖుల ఈద్ ముబార క్...
బక్రీద్ పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి డీకే అరుణ, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, మున్సిపల్ కమిషనర్ అమరయ్య, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, సౌత్ జోన్ ఖాదీ బోర్డు చైర్మన్ కాళప్ప, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరిధర్‌రావు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు ఓబెదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీలు విఠల్‌రావు, జితేందర్ రెడ్డి, తదితరులున్నారు.
భారీ బందోబస్తు..
బక్రీద్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.
భక్తి శ్రద్ధలతో బక్రీద్
Published Thu, Oct 17 2013 3:08 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement