ముస్లిం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
► సుధీర్‌కమిటీ సిఫారసు అమలు చేయాలి
► టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : వచ్చే బడ్జెట్‌లో ముస్లిం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి.. వెనకబడిన ముస్లింలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా వారికోసం సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి.. వెనకబడిన ముస్లింలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా వారికోసం సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి.. కార్పొరేషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక టీఎన్జీఓ భవన్ లో జేఏసీ ఆధ్వర్యంలో ‘ముస్లిం రిజర్వేషన్ – సుధీర్‌కమిటీ సిఫారసు అమలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కోదండరాం మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లను కొందరు వ్యతిరేకిస్తున్నారని, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు. వాస్తవానికి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని, రిజర్వేషన్లు కల్పిస్తే ముస్లిం విద్యార్థులు ముఖ్యంగా యువతులు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారన్నారు.
జేఏసీ అన్నివర్గాల పక్షం: జేఏసీ అన్నివర్గాల పక్షాన పోరాటం చేస్తుందని కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యం కూడా ఉందని, వారికి ప్రభుత్వాలు అండగా ఉంటే స్థితిగతుల్లో మార్పు వస్తుందని, అక్షరాస్యత శాతం పెరుగుతుందని తెలిపారు. ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ కు బ్యాంక్‌లను అనుసందానం చేసి రుణ సౌకర్యం కల్పించాలని, ఇలా చేస్తే ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లే సంఖ్య తగ్గుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో ముస్లింల జనాభా అధికంగా ఉంటుందని, అసంఘటిత రంగాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఆర్థికంగా ఎదుగుతారన్నారు. ఉర్దూ మీడియం పాఠశాలల్లో టీచర్ల కొరత తీర్చాలని, మదర్సాలను మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీజేఏసీ రాష్ట్ర కోచైర్మన్ ఖాజామైనొద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనీఫ్, టీజేసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ చంద్రనాయక్, అధికార ప్రతినిధి మెట్టుకాడి ప్రభాకర్, నాయకులు బాల్‌కిషన్, సతీష్, ఉల్లాసిద్దీఖీ, నర్సింహయ్య పాల్గొన్నారు.