అరకులో బాలకృష్ణ సినిమా షూటింగ్
- ఎస్‌ఎల్‌వి బ్యానర్‌పై చిత్రం ప్రారంభం
అరకులోయ : బాలకృష్ణహీరోగా ఎస్‌ఎల్‌వీ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా ఘాటింగ్ అరకులోయలోని సుంకరమెట్ట - గన్నెల రహదారిలో శనివారం ప్రారంభమైంది. డెరైక్టర్ సత్యదేవ, ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్‌ల పర్యవేక్షణలో రౌడీలతో బాలకృష్ణ పోరాడే సన్నివేశాలను కెమెరామెన్ బాబుప్రసాద్ చిత్రీకరించారు. ప్రముఖ నటి త్రిష, రాధికాప్తే హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదని నిర్మాత ఆర్. రమణరావు తెలిపారు. 10వ తేదీ వరకు అరకులోయ పరిసరాల్లో కొన్ని సన్నివేశాలతోపాటు పాటలు చిత్రీకరిస్తామన్నారు.
తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తా: బాలకృష్ణ
హూదూద్ తుపాను ప్రభావానికి నష్టపోయిన గ్రామాల్లో పర్యటించి, గిరిజనులకు జరిగిన నష్టాన్ని సీఎం నారాచంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి వారిని ఆదుకుంటానని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన బాలకృష్ణ అరకులోయలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అరకులోయ తనకు సొంత ఊరు లాంటిదన్నారు. తనకు మంచి హిట్‌లు అందించిన సినిమాల షూటింగ్ ఇక్కడే జరిపామని చెప్పారు. పర్యాటకశాఖ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. తుపాను ధాటికి ప్రకృతి అందాలకు నష్టం వాటిల్లిందన్నారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, దేశం పార్టీ నాయకులు శెట్టి బాబురావు, సివేరి అబ్రహాం, ఎస్.కె. రెహమాన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.