హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పాలనలో అజ్ఞాతవాసం అనుభవించిన ప్రజలకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి విముక్తి కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో చరమగీతం పాడారంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. నెలరోజుల్లో ఒక బహుమతితో మీముందుకు వస్తానని చెప్పారు. శనివారం ఆయన హిందూపురంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నాన్న ఎన్టీఆర్‌పై గౌరవం, నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజలందరికీ అభివందనం తెలియజేశారు. జనం అభిమానం చూస్తుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి విజయం సాధించిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. హిందూపురాన్ని రాష్ర్టంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ‘ప్రధానంగా ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రత్యేక నిధులు తీసుకొస్తానని, అవసరమైతే కేంద్రం నుంచి కూడా నిధులు కోరుతానని తెలిపారు. కృష్ణా జలాలను హిందూపురం ప్రాంతానికి తీసుకొస్తానని, హంద్రీనీవా ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకూ నింపుతామని చెప్పారు. పరిశ్రమలను రప్పించి యువతకు ఉపాధి చూపిస్తానన్నారు.
అంతకు ముందు ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే శుక్రవారం రాత్రి బాలకృష్ణను కలవడానికి వెళ్లానన్నారు. ఓటింగ్ సరళి, మెజార్టీ గురించి అడుగుతారనుకుంటే హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి.. కృష్ణా జాలాను ఏరూట్‌లో పైపులైన్లు వేయించడానికి మార్గం ఉంది.. నిధులు ఎన్ని కావాలి.. అని బాలయ్య అడుగుతుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. ఆయనకు ఈ ప్రాంత అభివృద్ధిపై ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమయ్యిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్‌ఘని, రంగనాయకులు, పార్టీ సీనియర్ నాయకులు అంబికా లక్ష్మినారాయణ, నంబూరిసతీష్, గ్రీన్‌పార్కు నాగరాజు, పామిశెట్టి శేఖర్, రోషన్ అలీ, రమేష్‌కుమార్, బాచీ, షఫి తదితరులు పాల్గొన్నారు.
బహుమతితో మీ ముందుకొస్తా
Published Sun, May 18 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement