Hindupram
-
కీచక తమ్ముడు.. అఘాయిత్యాలు
సాక్షి, హిందూపురం: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం రొద్దం వారి పల్లెలో ఓ టీడీపీ నాయకుడి వికృత చేష్టలు బయటపడ్డాయి. ఊరి దారిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళే మహిళలు, పొలాల్లో ఒంటరిగా పనిచేస్తున్న మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రెండురోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పొలంలో పనిచేసుకుంటుండగా గమనించిన శ్రీనివాసులు పొదలమాటున వచ్చి ఆమెపై విరుచుకుపడ్డాడు. భయపడిపోయిన ఆమె అతని నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు పరుగున రావడంతో ఆ కామంధుడు పారిపోయాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు చెప్పడంతో ఇతని చేష్టలతో విసిగిపోయిన వారు నేరుగా పోలీసుస్టేషన్ వెళ్లి ఎస్ఐ వెంకటేశులుకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులుకు టీడీపీ నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయి. గతంలోనూ పలువురు మహిళలపై అత్యాచారయత్నాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. గత రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోకపోగా, బాధితురాలినే పోలీసులు బెదిరించి పంపినట్లు సమాచారం. ఇతను ప్రధాన రహదారి నుండి గ్రామానికి వెళ్ళే దారుల్లో కాపు కాచి ఒంటరిగా వెళ్తున్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. రొద్దంవారి పల్లెకు చేరుకోవాలంటే కొడికొండ నుండి సోమగట్టకు వెళ్లే దారిలో బస్సు గాని ఆటో గాని దిగి రెండు కిలోమీటర్ల మేరకు నడిచి గ్రామాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. దీన్నే శ్రీనివాసులు అదును చేసుకుని గ్రామం నుంచి ఒంటరిగా మహిళలు వెళ్తున్న, వస్తున్న గమనించి వారి వెంటపడి అఘాత్యాలకు పాల్పతున్నాడని అంటున్నారు. ఇతనికి టీడీపీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీస్‌స్టేషన్‌లో సైతం పలు సంఘటనలు పంచాయతీలతో సరిపెట్టి కేసులు నమోదు కాకుండా చూసుకున్నాడని విమర్శిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై మాత్రం పోలీసులు కేసు రిజిష్టర్ చేసుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశులు చెప్పారు. -
మామా... ఏక్ పెగ్ లా!
సాక్షి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పట్టణంలో వైన్‌షాపులు కిటకిటలాడాయి. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా టీడీపీ కార్యకర్తలే కనిపించారు. ఆర్అండ్బీ గెస్హౌస్ట్, మేళాపురం క్రాస్ బైపాస్‌రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు మద్యం సీసాలతో దర్జాగా కనిపించారు. ఆ మత్తులోనే వాహనాల్లో తిరుగుతూ పట్టణప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!. నీవే ఆదర్శం: బాలయ్య కటౌట్ ముందు.. టీడీపీ బార్: వైన్‌షాప్ ముందు తమ్ముళ్ల వాహనాలు -
బహుమతితో మీ ముందుకొస్తా
హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పాలనలో అజ్ఞాతవాసం అనుభవించిన ప్రజలకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి విముక్తి కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో చరమగీతం పాడారంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. నెలరోజుల్లో ఒక బహుమతితో మీముందుకు వస్తానని చెప్పారు. శనివారం ఆయన హిందూపురంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నాన్న ఎన్టీఆర్‌పై గౌరవం, నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజలందరికీ అభివందనం తెలియజేశారు. జనం అభిమానం చూస్తుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి విజయం సాధించిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. హిందూపురాన్ని రాష్ర్టంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ‘ప్రధానంగా ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రత్యేక నిధులు తీసుకొస్తానని, అవసరమైతే కేంద్రం నుంచి కూడా నిధులు కోరుతానని తెలిపారు. కృష్ణా జలాలను హిందూపురం ప్రాంతానికి తీసుకొస్తానని, హంద్రీనీవా ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకూ నింపుతామని చెప్పారు. పరిశ్రమలను రప్పించి యువతకు ఉపాధి చూపిస్తానన్నారు. అంతకు ముందు ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే శుక్రవారం రాత్రి బాలకృష్ణను కలవడానికి వెళ్లానన్నారు. ఓటింగ్ సరళి, మెజార్టీ గురించి అడుగుతారనుకుంటే హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి.. కృష్ణా జాలాను ఏరూట్లో పైపులైన్లు వేయించడానికి మార్గం ఉంది.. నిధులు ఎన్ని కావాలి.. అని బాలయ్య అడుగుతుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. ఆయనకు ఈ ప్రాంత అభివృద్ధిపై ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమయ్యిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్‌ఘని, రంగనాయకులు, పార్టీ సీనియర్ నాయకులు అంబికా లక్ష్మినారాయణ, నంబూరిసతీష్, గ్రీన్‌పార్కు నాగరాజు, పామిశెట్టి శేఖర్, రోషన్ అలీ, రమేష్‌కుమార్, బాచీ, షఫి తదితరులు పాల్గొన్నారు.