టీడీపీ మండల నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్న శ్రీనివాసులు (ఫైల్) (ఇన్‌సెట్‌లో) నిందితుడు శ్రీనివాసులు
సాక్షి, హిందూపురం: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం రొద్దం వారి పల్లెలో ఓ టీడీపీ నాయకుడి వికృత చేష్టలు బయటపడ్డాయి. ఊరి దారిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళే మహిళలు, పొలాల్లో ఒంటరిగా పనిచేస్తున్న మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రెండురోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పొలంలో పనిచేసుకుంటుండగా గమనించిన శ్రీనివాసులు పొదలమాటున వచ్చి ఆమెపై విరుచుకుపడ్డాడు. భయపడిపోయిన ఆమె అతని నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు పరుగున రావడంతో ఆ కామంధుడు పారిపోయాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు చెప్పడంతో ఇతని చేష్టలతో విసిగిపోయిన వారు నేరుగా పోలీసుస్టేషన్ వెళ్లి ఎస్‌ఐ వెంకటేశులుకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులుకు టీడీపీ నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయి. గతంలోనూ పలువురు మహిళలపై అత్యాచారయత్నాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి.
గత రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోకపోగా, బాధితురాలినే పోలీసులు బెదిరించి పంపినట్లు సమాచారం. ఇతను ప్రధాన రహదారి నుండి గ్రామానికి వెళ్ళే దారుల్లో కాపు కాచి ఒంటరిగా వెళ్తున్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. రొద్దంవారి పల్లెకు చేరుకోవాలంటే కొడికొండ నుండి సోమగట్టకు వెళ్లే దారిలో బస్సు గాని ఆటో గాని దిగి రెండు కిలోమీటర్ల మేరకు నడిచి గ్రామాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. దీన్నే శ్రీనివాసులు అదును చేసుకుని గ్రామం నుంచి ఒంటరిగా మహిళలు వెళ్తున్న, వస్తున్న గమనించి వారి వెంటపడి అఘాత్యాలకు పాల్పతున్నాడని అంటున్నారు. ఇతనికి టీడీపీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీస్‌స్టేషన్‌లో సైతం పలు సంఘటనలు పంచాయతీలతో సరిపెట్టి కేసులు నమోదు కాకుండా చూసుకున్నాడని విమర్శిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై మాత్రం పోలీసులు కేసు రిజిష్టర్ చేసుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ వెంకటేశులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment