
గాయపడిన లక్ష్మీదేవమ్మ, తిమ్మారెడ్డి చేతికి గాయం
సాక్షి,అనంతపురం(ఎన్‌పీకుంట): మండలంలో టీడీపీ నాయకులు బరితెగించారు. తమ మాట వినలేదన్న అక్కసుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి తెగబడ్డారు. బాధిత కుటుంబసభ్యుడు మోహన్‌రెడ్డి తెలిపిన మేరకు... ఎన్‌పీకుంట మండలం పి.కొత్తపల్లి పంచాయతీ దిగువతూపల్లి గ్రామానికి చెందిన కాలాటి సుధాకరరెడ్డి, తిమ్మారెడ్డి అన్నదమ్ములు. టీడీపీలో కొనసాగుతూ వచ్చారు.
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిజమైన సంక్షేమ పాలన ఏమిటో తెలుసుకున్న తిమ్మారెడ్డి, తన భార్య లక్ష్మీదేవమ్మ, కుమారుడు మోహన్‌రెడ్డితో కలిసి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆ సమయంలో సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచిన టీడీపీ మద్దతుదారు విజయానికి సహకరించాలంటూ తిమ్మారెడ్డి కుటుంబంపై ఆ పార్టీకి చెందిన శ్రీరాములు నాయుడు, భాస్కరనాయుడు తీవ్ర ఒత్తిళ్లు తీసుకెళ్లారు.
అయినా తిమ్మారెడ్డి వారి మాట వినకుండా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయానికి కృషి చేశారు. ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. విషయాన్ని అంతటితో వదిలేయకుండా ఎలాగైనా తిమ్మారెడ్డిని ఇబ్బందిపెట్టి తిరిగి టీడీపీలోకి లాగాలనే కుట్రతో సుధాకరరెడ్డిని శ్రీరాములు నాయుడు పావుగా వాడుకోవడం మొదలు పెట్టాడు. తరచూ సుధాకరరెడ్డికి మద్యం తాపించి, తిమ్మారెడ్డి కుటుంబంపై ఉసిగొల్పేవాడు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మద్యం మత్తులో సుధాకరరెడ్డి కత్తితో దాడి చేస్తుండగా లక్ష్మీదేవమ్మ త్రుటిలో తప్పించుకుంది. ఆమె ముఖంపై బలమైన కత్తిగాటుపడింది. అడ్డుకోబోయిన తిమ్మారెడ్డి చేయి తెగింది. క్షతగాత్రులను హుటాహుటిన కదిరి ఏరియా ఆస్పత్రికి కుమారుడు మోహన్‌రెడ్డి తీసుకెళ్లారు. ఘటనపై సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు అతను పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment