నాలుగో సింహం నవ్వులపాలు!
- హెడ్ కానిస్టేబుల్ టోపీ పెట్టుకుని సెల్ఫీలు
- అధికార పార్టీ చోటా నేత సరదా
- 15 నిమిషాల పాటు ఫోజులు
అనంతపురం సెంట్రల్: అధికార పార్టీ అరాచకం హద్దు మీరుతోంది. ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే నేతల ధోరణి కాస్తా అధికారుల పరువును బజారున పడేస్తోంది. పోలీసులు కూడా వీరికి దాసోహం కావడంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ఇటీవల గుంటూరు జిల్లా కారంపూడి ఎస్‌ఐ టోపీ ధరించి అక్కడి టీడీపీ నేత హల్‌చల్ చేయడం మరువక ముందే.. సోమవారం జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుస్టేషన్ ఇలాంటి ఘటనకే వేదికగా మారింది. గార్లదిన్నె మేజర్ పంచాయతీ 2వ వార్డు మెంబర్(టీడీపీ) మురళీకృష్ణ ఓ హెడ్‌కానిస్టేబుల్ టోపీ ధరించి సెల్ఫీలు దిగడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 15 నిమిషాల పాటు టోపీ ఆయన తలపైనే ఉండటం గమనార్హం.
ఆదివారం రాత్రి గార్లదిన్నె మండల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఆ ఘటనకు సంబంధించి సాక్షులుగా గార్లదిన్నె పోలీసులు వార్డు మెంబర్ మురళీకృష్ణతో పాటు జంబులదిన్నె ఎంపీటీసీ సభ్యురాలిని సాక్షులుగా పిలిపించారు. అయితే వారిని ఔట్‌పోస్టు పోలీసుస్టేషన్‌లో కూర్చొబెట్టారు. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ టోపీతో సెల్ఫీలు దిగారు. పైగా పోలీసులకు సంబంధించిన బ్యాగులోని రికార్డులను(ఎఫ్‌ఐఆర్) తీసి పోలీసులు ఏం రాశారోనని పరిశీలించారు.
ఈ సందర్భగా ‘సాక్షి’ ఆరా తీయగా.. తమ సమక్షంలో పోస్టుమార్టం చేస్తామని పోలీసులు బతిమాలుతుంటే వచ్చామన్నారు. గేట్ కృష్ణారెడ్డి అన్న పంపించాడని.. తమలాంటి ప్రజా ప్రతినిధులకు తప్పదు కదా.. అంటూ తన తీరును ఆయన సమర్థించుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌తో చట్టాపట్టాలేసుకొని వెళ్లిపోయారు. పోలీసుశాఖలో మితిమీరుతున్న టీడీపీ నేతల జోక్యానికి ఈ ఘటన తాజా నిదర్శనం.