ఓటమి భయంతో బాలయ్య శివాలు
నేతలపై చేయిచేసుకుంటున్న వైనం
ఓ నేతను కాలితో తన్నినట్లు
సెల్‌ఫోన్లలో హల్‌చల్
అనంతపురం: తన ప్రచారానికి అనుకున్న రీతిలో జన స్పందన లేదన్న అసహనంతో సినీ నటుడు, హిందూపురం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ శివాలెత్తారు. డబ్బు ఖర్చు చేయకపోయినా శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల సభకు జనం తండోపతండాలుగా తరలిరావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి గురయ్యారు. రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా మనవైపు జనం ఎందుకు రావడం లేదని.. ఆ డబ్బు పంచారా.. లేదా? అంటూ ఆదివారం ఉదయం స్థానిక నేతలపై మండిపడినట్లు తెలిసింది. ఓ దశలో ఆగ్రహంతో ఊగిపోయినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. దగ్గరకెళ్తే చేయి చేసుకుంటారేమోనని ఆయనకు చాలా దూరంగా నేతలు నిలుచుని మాట్లాడినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ ఎమ్మెల్యే పి. రంగనాయకులు, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి నిమ్మల కిష్టప్ప, ఇటీవల ఆ పార్టీలో చేరిన అంబికా లక్ష్మీనారాయణలను ఇటీవలే జనం తక్కువగా వచ్చారని అందరి ఎదుటే దుర్భాషలాడారు. ఇలాంటి పరిస్థితి పలుమార్లు ఎదురుకావడంతో నేతలు ప్రచారానికి ఆయన వెంట వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఆయన నామినేషన్ వేసిన రోజు వరదాపురం సూరిని తీవ్రంగా హెచ్చరించింది మొదలు ఇప్పటిదాకా.. పదుల సంఖ్యలో స్థానిక నేతలపై విరుచుకుపడినట్లు తెలిసింది.
బాలకృష్ణ ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆయన వెంట ఉండే అంగరక్షకులు సైతం వాపోతున్నారు. జనం తక్కువగా ఉన్నారని మండిపడుతూ.. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేపై బాలకృష్ణ చేయి చేసుకున్నారనే విషయం ఆదివారం వెలుగు చూసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని సదరు బాధిత నేతను చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఫోన్‌లో వేడుకున్నట్లు సమాచారం. తాజాగా...తన అనుమతి లేకుండా స్థానిక నేత ఒకరు వాహనం ఎక్కుతుండగా బాలకృష్ణ కాలితో తన్నడం దుమారం రేపింది. ఈ చిత్రాలు ఆదివారం సెల్‌ఫోన్లు, టీవీల్లో హల్‌చల్ చేశాయి. కాగా, హిందూపురంలో ఆదివారం బాలకృష్ణ సతీమణి వసుంధర, సినీ నటుడు అలీ ప్రచారం నిర్వహించారు. అలీ రోడ్ షోను స్థానికులెవరూ పట్టుంచుకోక పోవడంతో ఆయన అలిగి వాహనంపై నుంచి దిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
వాహనాలపై రాళ్లు
బుక్కరాయసముద్రం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బాలకృష్ణ శింగనమల మండలంలో పర్యటించారు. రాత్రి 9 గంటల సమయంలో సిద్ధరాంపురం వద్ద సర్పంచ్ హన్మంతరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, గ్రామస్తులు.. అనంతపురం వెళుతున్న బాలయ్య కాన్వాయ్‌ని ఆపారు. తమ గ్రామంలోకి రావాలని ఆహ్వానించారు. అక్కడ ఆగకుండా వెళ్లిపోవాలనుకున్న బాలకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఎవరి వాహనం ఆపుతున్నావో తెలుసా.. బుద్దుందా.. అంటూ సర్పంచ్‌పై విరుచుకుపడ్డారు. బాలకృష్ణ నోరు పారేసుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడంతో మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.