సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 582 అడుగుల నీరున్నా వరిపంటకు పూర్తిస్థాయిలో నీరివ్వలేమని చంద్రబాబు సర్కార్ చేతులెత్తడం దుర్మార్గమని, బాబుసర్కార్ కు జిల్లా రైతాంగం ఉసురు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ పట్టుమని 12 టీఎంసీల నీరుకూడా రాలేదన్నారు. ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండాయన్నారు. నాలుగేళ్లుగా వరుస కరువులతో పంటలు లేక కరువు బారినపడిన జిల్లా రైతాంగం ఈ సారైనా నీళ్లొస్తామని ఆశించారన్నారు.
ప్రభుత్వం సైతం వరిపంటకు నీళ్లిస్తామని ప్రకటించిందని బాలినేని చెప్పారు. దీంతో రైతులు వరినార్లు పోసుకున్నారని, తీరా వరిపంటకు పూర్తిస్థాయిలోల నీళ్లివ్వలేమని అధికారులు, ప్రభుత్వం చేతులెత్తడం దుర్మార్గమన్నారు. సాగర్ కింద ఆరుతడి పంటలు పోను పట్టుమని రెండు లక్షల ఎకరాలు కూడా వరిపంట సాగయ్యే పరిస్థితి లేదన్నారు. ఇందు కోసం 20 టీఎంసీల నీరు సరిపోతుందన్నారు. మొత్తం ఆరుతడి పంటకు కలిపి 8 నుండి 10 టీఎంసీ నీరు సరిపోతుందని బాలినేని తెలిపారు. ఒక వైపు జిల్లాకు ఇంకా 40 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. ఈ నీరు అన్ని పంటలకు సరిపోతుందన్నారు. అలాంటిది ఇప్పటి వరకూ వరినార్లు పోసుకున్నవారు మాత్రమే వరి సాగుచేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని బాలినేని విమర్శించారు. ఇప్పటి వరకూ పట్టుమని 20 శాతం కూడా వరి సాగు కాలేదన్నారు.
అధికారులు చెప్పిన ప్రకారం మరో 30 శాతం కూడా వరినాట్లు పడేపరిస్థితి లేదన్నారు. నాలుగేళ్లు వరుస కరువులతో తిండిగింజలు, పశువుల మేత అందక రైతాంగం విలవిల లాడుతోందన్నారు. వైఎస్ హాయంలో సాగర్‌లో 545 అడుగుల నీరున్నపుడే వరిపంటకు నీళ్లిచ్చారని బాలినేని గుర్తు చేశారు. ప్రస్తుతం సాగర్ లో 582 అడుగుల నీరున్నా పూర్తిగా వరిపంటకు నీరు ఇవ్వలేమనడం దారుణమన్నారు. జిల్లా టీడీపీ నేతలకు ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఏ మాత్రం రైతులపై ప్రేమున్నా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చి సాగర్ జలాలను పూర్తిస్థాయిలో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని బాలినేని సూచించారు. ప్రకాశం జిల్లా రైతాంగంపై వివక్షతోనే చంద్రబాబు సర్కార్ ఇలా చేస్తుందని బాలినేని విమర్శించారు. వరి పంటకు పూర్తిస్థాయిలో నీరివ్వక పోతే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment