బాల్‌బ్యాడ్మింటన్.. అదిరెన్ | ball badminton competitions in nidadavolu | Sakshi
Sakshi News home page

బాల్‌బ్యాడ్మింటన్.. అదిరెన్

Published Sat, Jul 12 2014 1:36 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

ball badminton competitions in nidadavolu

- నిడదవోలులో అంతర్ జిల్లాల పోటీలు ఆరంభం
- 13 జిల్లాల నుంచి 260 మంది రాక
- మూడు రోజులపాటు టోర్నమెంట్

 నిడదవోలు: వాయు వేగంతో దూసుకువచ్చే బాల్స్.. రాకెట్ వేగంతో ప్రత్యర్థులను చిత్తుచేసే షాట్స్.. అనుక్షణం ఉత్కంఠ కలిగించిన పాయింట్లు.. ఇవీ నిడదవోలు ఎస్వీడీ మహిళా డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కనిపించిన దృశ్యాలు. రాష్ట్ర బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల జూనియర్ (అండర్-20) బాల బాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 260 మంది క్రీడాకారులు తరలివచ్చారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు తొలిరోజు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో 12 మ్యాచ్‌లు, బాలికల విభాగంలో 11 మ్యాచ్‌లను జరిగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 260 మంది తరలివచ్చారు.
 
తొలిరోజు విజేతలు
బాలుర విభాగం.. శ్రీకాకుళంపై (29-12, 29-10) తేడాతో తూర్పుగోదావరి జట్టు, చిత్తూరుపై (29-17, 29-12) తేడాతో కృష్ణా జట్టు, కడపపై (29-17, 29-12) తేడాతో విశాఖ జట్టు సత్తాచాటాయి. విజయనగరంపై (29-07, 29-09) తేడాతో గుంటూరు జట్టు, నెల్లూరుపై (29-21, 29-05) తేడాతో కర్నూలు జట్టు, పశ్చిమగోదావరిపై (29-08, 29-20) తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించాయి. నెల్లూరుపై (29-10, 29-11) తేడాతో విశాఖ జట్టు, ప్రకాశంపై (29-19, 29-23) తేడాతో తూర్పుగోదావరి జట్టు, శ్రీకాకుళంపై (29-13, 29-02) తేడాతో విజయనగరం జట్టు గెలుపొందాయి. గుంటూరుపై (29-26, 29-20) తేడాతో  చిత్తూరు జట్టు, కృష్ణాపై (29-23, 29-06) తేడాతో ప్రకాశం జట్టు, అనంతపురంపై (29-15, 29-23) తేడాతో కర్నూలు జట్టు సత్తాచాటాయి.
     
బాలికల విభాగం.. కడపపై (29-07, 29-08) తేడాతో విశాఖ జట్టు, చిత్తూరుపై (29-21, 29-14) తేడాతో కర్నూలు జట్టు, అనంతపురంపై (29-11, 29-05) తేడాతో కృష్ణా జట్టు విజయం సాధించాయి. శ్రీకాకుళంపై (29-07, 29-03) తేడాతో గుంటూరు జట్టు, నెల్లూరుపై (29-16, 29-12) తేడాతో తూర్పుగోదావరి జట్టు, ప్రకాశంపై (29-17, 29-17) తేడాతో కర్నూలు జట్టు గెలుపొందాయి. పశ్చిమగోదావరిపై (29-23, 29-10) తేడాతో విజయనగరం జట్టు, అనంతపురంపై (29-04, 29-11) తేడాతో విశాఖ జట్టు, నెల్లూరుపై (29-16, 29-13) తేడాతో గుంటూరు జట్టు సత్తాచాటాయి. చిత్తూరుపై (29-26, 29-08) తేడాతో కృష్ణా జట్టు, తూర్పుగోదావరిపై (29-02, 29-12) తేడాతో విజయనగరం జట్టు విజయం సాధించాయి.
 
జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి
విద్యార్థులు క్రీడాపోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు. బాల్‌బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి ఆయన ప్రసంగించారు. విద్యార్థులు బాల్య దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మరో ముఖ్య అతిథి స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారని చెప్పారు.
 
నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచిం చారు. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చుక్కపల్లి అమర్‌కుమార్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తిగా ముందుకుసాగాలని సూచించారు. రాష్ట్ర పునఃనిర్మాణం కోసం అసోసియేషన్ తరఫున లక్ష రూపాయాల విరాళాన్ని ప్రకటించారు.  
 
గౌరవ వందనం : ముందుగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని ఉప ముఖ్యమంత్రి స్వీకరించారు. అనంతరం  పావురాలను గాలిలో వదలి ఆయన క్రీడాజ్యోతిని వెలిగించారు. బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులకు ఉల్లాసపరిచారు. కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏపీఎస్‌బీబీఏ కార్యదర్శి రావు వెంకట్రావు, బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఎన్.త్రిమూర్తులు, చీఫ్ ప్యాట్రన్ నీలం నాగేంద్రప్రసాద్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, పీడీ సత్తి బాపిరెడ్డి, టోర్నమెంట్ కమిటీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఆర్.ప్రసాద్, కార్యదర్శి సీహెచ్ సతీష్‌కుమార్, అధ్యక్షుడు ఏవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement