పురిట్లోనే సంధి..? | bangaru thalli scheme is not implemented properly | Sakshi
Sakshi News home page

పురిట్లోనే సంధి..?

Published Sun, Dec 15 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

bangaru thalli scheme is not implemented properly

పిఠాపురం, న్యూస్‌లైన్ : అతివలు ఆకాశ వీధుల్లో విజయపతాకం ఎగరేస్తున్న ఈ కాలంలోనూ ఆడపిల్లను ‘మహాలక్ష్మి’లా కాక.. మనశ్శాంతిని దూరం చేసే గుండెల మీద కుపటిలా భావించే వారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకం పేదవర్గాల్లో ఈ భావనను దూరం చేసేందుకు దోహదపడుతుందన్న ఆశ పేరాశ  అవుతుందనిపిస్తోంది. పుట్టిన నాటి నుంచి పట్టభద్రురాలయ్యే వరకూ ఏటా ఆర్థికసాయం అందించడంతో పాటు చదువయ్యాక ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మరికొంత మొత్తం ఇచ్చేలా రూపొందించిన ఈ పథకం అమలు ‘ఆదిలోనే హంసపాదు’లా తయారైంది. తొలి విడతగా ఇవ్వాల్సిన బిడ్డ సంరక్షణ ఖర్చులే ఇంకా లబ్ధిదారుల ఖాతాలకు జమ కాలేదు. బాలికా సంరక్షణ పేరుతో ముఖ్యమం త్రి ప్రకటించిన ‘బంగారు తల్లి’ అమలు..  చేసిన ప్రచార ఆర్భాటానికి అనువుగా లేనేలేదు. ఆడపిల్ల పుడితే వారింట బంగారమే అని ప్రచారం చేసిన అధికారులు ఆచరణలో అందుకు తగ్గ శ్రద్ధను చూపడం లేదు.
 
 తెల్ల రేషన్‌కార్డు ఉన్న దంపతులకు పుట్టే ఆడపిల్లలకు ఈ పథకం ఈ ఏడాది మే నెల నుంచి అమలులోకి వస్తుందని ప్రచారం జరిగినా గత నెల రోజుల నుంచి మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్నా, ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నా ఈ పథకానికి అర్హులే.  జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి 8,800 మంది దరఖాస్తు చేసుకోగా 3500 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొదటి విడత గా రూ.1.10 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల నుంచి 950 మంది దరఖాస్తు చేసుకోగా 256 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరందరికీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో గత నెల రోజుల నుంచీ ధృవీకరణ పత్రాలు (బాండ్లు) పంపిణీ చేయిస్తున్నారు. 
 
 ఎదిగే కొద్దీ.. కొద్దికొద్దిగా...
 ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి బిడ్డ సంరక్షణ ఖర్చుల కోసం రూ.2500, ఆ తరువాత టీకాల కోసం రూ.వెయ్యి, అంగన్‌వాడీ చదువులకు ఏటా రూ.1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏటా రూ.2 వేలు, ఆరు నుంచి ఎనిమి దో తరగతి వరకు ఏటా రూ.2500, తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఏటా రూ.3 వేలు, ఇంటర్‌మీడియట్‌లో ఏటా రూ.3,500, డిగ్రీలో ఏటా రూ.4 వేల చొప్పున దశల వారీగా అం దించేలా ఈ పథకాన్ని రూపొందించారు. బాలి కకు 18 ఏళ్లు నిండాక ఇంటర్‌మీడియట్‌తో చ దువు ఆపివేస్తే రూ.50 వేలు, డిగ్రీతర్వాత రూ. లక్ష ఇస్తారు. ఈ మొత్తం వారి స్వయం ఉ పాధికి దోహదపడుతుందన్నది ప్రభుత్వ లక్ష్యం. 
 
 మూణ్నాళ్ల ముచ్చటేనా..?
 ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారుల పిల్లల సం రక్షణ నిమిత్తం తొలి విడతగా రూ.2500 చొప్పు న బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. అయితే కాగితాలపై ఘనంగా, ప్రకటనల్లో ఆకర్షణీయంగా ఉన్న పథకం అమలు అందుకు త గ్గట్టు ఎంత మాత్రం లేదు. బాండ్లు పంపిణీ చే సి నెలవుతున్నా ఏ ఒక్కరి ఖాతాలోనూ ఆ మొ త్తం జమ కాలేదు. పథకం ప్రచారాన్ని చూసి మురిసిన ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆ మురి పెం మూణ్నాళ్ల ముచ్చటేనా అన్న శంక కలుగుతోంది. దశలవారీ సాయంలో ‘బోణీ’యే కాకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు. మరోవైపు పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయడం లేదని, లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకుల సిఫార్సులనే పరిగణనలోకి తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement