ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో బంగారుతల్లికి భరోసా దక్కడం లేదు. ఈ పథకంలో అర్హులందరికి లబ్ధి చేకూరడం లేదు. జనాభాలో బాలికల నిష్పత్తిని పెంచడం, విద్య ద్వారా బాలికా సాధికారత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది మే ఒకటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలులోకి వచ్చింది. అయితే దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన కల్పించకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు, గ్రామైక్య సంఘం ఖాతాలు, ఆధార్‌కార్డులు లేవంటూ దరఖాస్తులను ఆమోదించడం లేదు. మరోవైపు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఇక అన్ని అర్హతలు ఉన్నా పలువురు లబ్ధిదారులకు డబ్బు మంజూరు కాక కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
బంగారుతల్లి పథకంలో రూరల్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులను డీఆర్‌డీఏ పరిధిలో, మున్సిపల్ ప్రాంతాల వారిని మెప్మా పరిధిలో ఎంపిక చేస్తారు. 2013 మే ఒకటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి డీఆర్‌డీఏ పరిధిలో 4,276 మంది, మెప్మా పరిధిలో 974 మంది.. మొత్తం 5250 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు డీఆర్‌డీఏ పరిధిలో 3,191 మంది, మెప్మా పరిధిలో 314 మంది చిన్నారులకు మాత్రమే లబ్ధి చేకూరింది. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలు, తెల్లరేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు లేవంటూ అధికారులు కిరికిరి పెడుతున్నారు.
శాఖల మధ్య కొరవడిన సమన్వయం...
బంగారు తల్లి పథకం అమలులో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారుల పాత్ర కీలకం. బిడ్డ పుట్టిన వెంటనే ఆ ప్రాంతంలోని ఆరోగ్యశాఖకు చెందిన ఆశా కార్యకర్తలు, ఐసీడీఎస్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలుస్తుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తేదీ, కుటుంబ ఆదాయం తదితర వివరాలతో గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని గ్రామీణ ప్రాంతాల వారు మహిళా సమాఖ్యల ద్వారా ఐకేపీ(డీఆర్‌డీఏ) అధికారులకు, పట్టణ ప్రాంతాల వారు పట్టణాభివృద్ధి పథకం(మెప్మా) అధికారులకు అందజేయాలి. అయితే ఒక శాఖకు, మరో శాఖకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు తెలిసిన విషయం అంగన్‌వాడీ వారి దృష్టికి తీసుకరాకపోవడం, ఇద్దరికీ తెలిసినా గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో అలసత్వం వహించడం పరిపాటిగా మారింది. ఇక ఆ తర్వాత ఆన్‌లైన్ చేయాల్సిన అధికారులు.. ఆధార్ కార్డులు, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయినట్లు సర్టిఫికెట్లు లేవంటూ దరఖాస్తులను మూలన పడేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇంకా సగం మంది ఆధార్ కార్డులు దిగలేదు. దిగిన వారిలోనూ ఎక్కువ మందికి కార్డులు అందలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆధార్‌కార్డులు ఎలా తేవాలో బోధపడక పలువురు లబ్ధిదారులు దరఖాస్తు చేయడమే మానేస్తున్నారు. అలాగే పాప తల్లికి రేషన్‌కార్డు ఉండాలనే నిబంధనలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా పెళ్లయిన వారి పేర్లు అత్తవారింట్లో ఉన్న కార్డుల్లో నమోదు కాకపోవడంతో.. తెల్లరేషన్ కార్డు లేదనే నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పలువురు మహిళలు వాపోతున్నారు.
బర్త్ సర్టిఫికెట్ కోసం పుట్టెడు కష్టాలు...
బిడ్డ పుట్టినా.. ఆ సర్టిఫికెట్ కోసం పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ప్రసూతి అయిన వారికి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ సరిపోతుందని నిబంధనలు చెపుతున్నా.. పలువురు అధికారులు ఆ సర్టిఫికెట్‌లను అనుమతించడం లేదు. ఇక ఇంటి వద్ద ప్రసవం అయిన వారు సర్టిఫికెట్ తీసుకోవాలంటే గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్ మొదలైన వారి చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా ఇన్ని ఇబ్బందులు పడినా.. సర్టిఫికెట్ రాకపోవడంతో పలువురు తల్లులు దరఖాస్తు చేసేందుకు ముందుకు రావడం లేదు.
బంగారుతల్లికి భరోసా ఏదీ..?
Published Wed, Jan 22 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement