కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్:
వేతన సవరణను వెంటనే అమలు చేయాలని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ కన్వీనర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం అన్ని ప్రధాన బ్యాంకులు, అనుబంధ శాఖల ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దాదాపు 5వేల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో 880 బ్యాంకులు మూతపడ్డాయి. ఈ కారణంగా రూ.500 కోట్ల లావాదేవీలు స్తంభించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. నగరంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద అన్ని బ్యాంకుల యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేతన సవరణలో ప్రభుత్వం సిఫారసు చేసిన 10 శాతం పెంపును ఆమోదించే ప్రసక్తే లేదన్నారు.
కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం స్థానిక బుధవారపేటలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట అన్ని యూనియన్లకు చెందిన నాయకులు, ఉద్యోగులు ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాంకులు మూత
Published Tue, Feb 11 2014 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement