సాక్షి, ఒంగోలు: వడ్డీ వ్యాపారుల చేతుల్లో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల పాలవుతున్నాడు. ఇంట్లోని చిన్నచితకా వస్తువుల దగ్గర్నుంచి చిన్నారుల చెవిపోగుల వరకు తీసుకెళ్లి తాకట్టుపెట్టుకునో.. అమ్ముకునో డబ్బు తీసుకునే మార్గాల్లో పడ్డాడు. సందట్లో సడేమియా అంటూ రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు భారీ వడ్డీలు చెబుతుండటంతో కర్షకులు బతుకు భారం
బిక్కచచ్చిపోతున్నారు. కొన్నిచోట్ల మైక్రోఫైనాన్స్ సంస్థలనూ ఆశ్రయించక తప్పడం లేదు. సర్కారు నిర్వాకమే దీనంతటికీ కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకపోవడం, రీషెడ్యూల్ లేకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు. దీంతో సాగు ఖర్చుల కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.
ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే.. రైతులు ఆందోళన చేయట్లేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలపై పల్లెల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. భవిష్యత్తు అగమ్య గోచరమై దిక్కుతోచని స్థితిలో ఉంటే... రైతులంతా హాయిగా ఉన్నారంటూ సర్కారు పెద్దలు చెప్పుకోవడం విడ్డూరమేనని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్నేళ్లుగా కరువుతో సతమతమవుతున్న రైతులకు సాధారణ వడ్డీలకు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. బ్యాంకులు తప్ప మరో ఆధారం లేదు. అయితే, ఆ బ్యాంకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి.
బ్యాంకులకు వెళ్తే గతంలో తీసుకున్న బకాయిలు కట్టాలంటూ నోటీసులు తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లేదని రైతులు అటువైపుగా కూడా వెళ్లడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా రైతులు వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఇంత చేసినా పంట చేతికి దక్కుతుందా..? అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రకృతి దయచూపితే తిండిగింజలు ఇంటికొస్తాయి.. లేదంటే, పస్తులు తప్పనట్లే. ప్రస్తుతం ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు అప్పులు తీసుకుంటున్నారు. ఆలస్యంగా వర్షాలు కురుస్తుండటం, ఎరువుల కొరత, పట్టిపీడిస్తున్న తెగుళ్ల బెడదతో దిగుబడి అంచనా వేయలేకపోతున్నారు. దీంతో రైతులు భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు.
వడ్డీ వ్యాపారుల చేతుల్లో అన్నదాత విల విల
Published Sun, Sep 21 2014 2:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement