Pawnbrokers
-
వడ్డీ వ్యాపారుల అరెస్టు..
- రూ.56 లక్షలు స్వాధీనం నాచారం ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండటమే కాకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న నిందితులను నాచారం పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ. 56 లక్షల నగదు, రూ. 9కోట్ల విలువ గల 150 చెక్స్, 93 సేల్ డీడ్స, 2 సెల్ ఫోన్లను స్వాథీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై గురువారం అల్వాల్ డీసీపీ రాంచందర్ తెలిపిన వివరాలివీ.. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఎ. విజయ్ కుమారుడు శ్రీనివాస్(49) పైనాన్స వ్యాపారం చేస్తూ హబ్సిగూడలోని సాయి ఎన్క్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ అధిక వడ్డీలకు చిరువ్యాపారులకు, వివిధ రంగాల డిస్టిబ్యూటర్లకు పైనాన్స చేస్తుంటాడు. శ్రీనివాస్ చిరు వ్యాపారులకు, డిస్టిబ్యూటర్లకు ఫైనాన్స ఇస్తామని దిన పత్రికల్లో ప్రకటనలుఘిచ్చారు. శ్రీనివాస్ తన ఫైనాన్స కలెక్షన్ ఏజెంట్లుగా రాం నగర్‌కు చెందిన వీరేశం(59), కృష్ణ మూర్తిలను పెట్టుకున్నాడు. పత్రికల్లో ప్రకటనలు చూసి ఉప్పల్‌కు చెందిన పార్లీ డిస్టిబ్యూటర్ సంతోష్ , రవిందర్‌లు శ్రీనివాస్ వద్ద మొదట 6 శాతం వడ్డీకి ఫైనాన్స తీసుకున్నారు. అలా సంతోష్, రవిందర్‌లు శ్రీనివాస్ వద్ద రూ. 30 లక్షలు, రవిందర్ రూ. 90లక్షలు శ్రీనివాస్ వద్ద ఫైనాన్స తీసుకున్నారు. శ్రీనివాస్ చివరకు వారి వద్ద 20 శాతం వడ్డీ వసూలు చేశాడు. శ్రీనివాస్ పైనాన్స ఇచ్చే సమయంలో చెక్‌లు, బాండ్లు, సేల్ డీడ్లు, తనక పెట్టుకుని ఇచ్చేవాడు. వడ్డీ చెల్లించకుంటే బెదరింపులకు పాల్పడటమే కాకుండా ఆస్తులు జప్తు చేసుకునేవాడు. శ్రీనివాస్ వేధింపులు భరించలేక సంతోష్, రవిందర్ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులతో దర్యాప్తు చేపట్టి బుధవారం సాయంత్రం ఫైనాన్స వ్యాపారి శ్రీనివాస్, కలెక్షన్ ఏజెంట్ వీరేశంలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 56,20,000 నగదు, రూ. 9,26, 24,000 విలువ గల వివిధ బ్యాంకులకు చెందిన 150 చెక్‌లు, 93 సేల్ డీడ్స, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ పై ఐపిసి సెక్షన్ 3, 5, 8, 10, 13, మనీ లాండరింగ్ చట్టం 1349 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వడ్డీ వ్యాపారుల కట్టడి చట్టానికి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన అప్పులను బలవంతంగా వసూలు చేయడం, అధిక వడ్డీ తీసుకోవడం వంటి చర్యలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కుల వృత్తిదారుల నుంచి బలవంతంగా అప్పులను వసూలు చేసినా, అధిక వడ్డీ తీసుకున్నా .. అలాంటి వ్యాపారులను ఇక నుంచి కొత్త చట్ట ప్రకారం శిక్షించనున్నారు. బుధవారం శాసనసభలో డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ ఆలీ ‘స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రిలీఫ్-2016’ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. -
దయలేని దా‘రుణాలు’
కిటకిటలాడుతున్న బెజవాడ పోలీసు కమిషనరేట్ ♦ ఫిర్యాదుదారుల్లో ఎవర్ని కదిలించినా.. కన్నీళ్లే ♦ ఒక్కసారి ‘లొంగితే’ వడ్డీ మొత్తం మాఫీ చేస్తారట ♦ 300 దాటిన ఫిర్యాదులు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు ‘నేను చాలా అందంగా ఉంటానంట.. ఒక్కసారి తన దగ్గరకు వెళ్తే చాలంట.. వడ్డీతోపాటు అప్పుమొత్తం మాఫీ చేస్తాడంట..!’ ఇదో నిస్సహాయ ఆడపడుచు ఆవేదన. ‘ఆవిడగారు చెప్పిన లాయర్ దగ్గరకెళ్తే అప్పు సంగతి ఆయనే చూసుకుంటాడంట.. ఆపైన నాకు అప్పు భయం అక్కర్లేదంట. తోటి ఆడమనిషి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అప్పు తీసుకున్నంత మాత్రాన అంత అలుసా..?’ ఇదో బాధితురాలి ఆక్రోశం. ‘ఈ నెలాఖరులోగా అసలుతోపాటు వడ్డీ కూడా కట్టి తీరాల్సిందే. నువ్వేం చేస్తావో, ఎవరి దగ్గర పడుకుంటావో మాకు తెలియదని బెదిరిస్తున్నారు’ కన్నీళ్ల పర్యంతమైన ఎస్సీ మహిళ ఆందోళన. - సాక్షి, విజయవాడ బ్యూరో .... ఇలా ఫిర్యాదుదారులెవర్ని కదిలించినా కన్నీళ్లే. చెప్పే వేదనలన్నీ కనీవినీ ఎరుగని దారుణాలే. ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. నెలల తరబడి తీరని వ్యథ. నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇచ్చిన భరోసాతో ముందుకొచ్చి వడ్డీ వ్యాపారులు, కాల్‌మనీ దారుణాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. శుక్రవారం కమిషనరేట్‌కు 150 మందికిపైగా ఫిర్యాదుదారులు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ దాదాపు 300 వరకు ఫిర్యాదుల్ని స్వీకరించిన పోలీసు అధికారులు తిరిగి మరుసటి రోజు రమ్మని మిగతా వారిని పంపారు. వీరిలో మూడో వంతు ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కాల్‌మనీ బాధితులకంటే, వడ్డీ వ్యాపారుల బాధితులే ఎక్కువ మంది కమిషనర్‌ను కలిశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన పిమ్మట సెక్షన్ల వారీగా వాటిని విభజించి ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. శుక్రవారం కమిషనరేట్‌కు వచ్చిన పలువురు మహిళలు వడ్డీ వ్యాపారుల బెదిరింపులను వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చర్చ కోసమంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌పై చర్చకు మాత్రం అంగీకరించకపోవడం గమనార్హం. ఎవరికోసమైతే అంబేడ్కర్ జీవితాంతం పోరాడారో ఆ అణగారిన వర్గాలవారే ఈ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ బాధితుల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ వీరి విషయాన్ని పట్టించుకోకుండా కేవలం అంబేడ్కర్‌పై చర్చ అంటూ చంద్రబాబు.. సెక్స్ రాకెట్‌పై చర్చించకపోవడం సిగ్గుచేటంటూ మహిళాలోకం మండిపడుతోంది. -
వడ్డీజలగలు
సగటు జీవి విలవిల చక్రవడ్డీలతో ఆస్తులు స్వాహా బెదిరింపులు.. ఆపై దాడులు కొత్త సీపీ జోక్యం కోసం ఎదురుచూపులు నగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నెలవారీ, రోజువారీ, కాల్‌మనీ.. ఇలా రకరకాల పేర్లతో అవసరమైన వారికి వల విసిరి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆపై బెదిరింపులకు దిగుతున్నారు. తీసుకున్న అప్పుకు చక్రవడ్డీ వేసి మరీ ఆస్తులు గుంజుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి వేధింపులు తాళలేక, పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. వీధికో వడ్డీ వ్యాపారి దర్శనమిస్తూ అభాగ్యుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. విజయవాడ సిటీ : నగరంలో నెలకు రూ.100 కోట్ల మేర వడ్డీ వ్యాపారం జరుగుతోందంటే వడ్డీ వ్యాపారులు ఏ మేరకు వేళ్లూనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వీరి ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతుంటే.. రాజకీయ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నెలవారీ ముఠాలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే టార్గెట్‌గా నెలవారీ వడ్డీ వ్యాపారం చేసే ముఠాలున్నాయి. వీరు ఆయా కార్యాలయాల్లో తమ ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు అవసరమైనవారిని ఆకర్షిస్తుంటారు. నెలకు నూటికి రూ.7 నుంచి రూ.10 వరకు వడ్డీకి అప్పు ఇస్తారు. హామీగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుంటారు. ఆపై ఉద్యోగుల ఏటీఎం కార్డు తీసుకుని జీతం పడగానే వడ్డీ సొమ్ము డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ వీరికి పట్టదు. పైగా సంబంధిత కార్యాలయాల ప్రధాన అధికారులతో వీరిని బెదిరిస్తారు. రోజువారీ.. : మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ముఠా కూలీల కోసం రోజువారీ వడ్డీ వ్యాపారం సాగుతోంది. రూ.1000 నుంచి రూ.10 వేల వరకు రోజువారీ వడ్డీకి అప్పు ఇస్తారు. ఈ పద్ధతిలో నూటికి రూ.15 నుంచి రూ.20 వరకు వడ్డీ కింద ముందుగానే తీసేసుకుంటారు. రూ.10 వేలు తీసుకుంటే వడ్డీ కింద రూ.1500 నుంచి రూ.2 వేల వరకు మినహాయించుకుంటారు. మిగిలిన మొత్తాన్ని 100 రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. నెలకు నూటికి రూ.6.50 వరకు వడ్డీ పడుతుంది. పైగా వడ్డీని ముందే తీసుకోవడం ఈ విధానంలో ముఖ్యం. సాయంత్రమైతే చాలు రోజువారీ వడ్డీ వ్యాపారులు వసూళ్ల బాట పడతారు. ఎవరైనా కట్టబోమంటే దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. కాల్‌మనీ : పెద్ద వ్యాపారులు నగదు సర్దుబాటు చేసేందుకు వీరిని ఆశ్రయిస్తుంటారు. ఆకస్మికంగా సరుకు తీసుకోవాల్సివస్తే కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. రూ.1000కి రూ.12 వడ్డీ. సాయంత్రం వడ్డీతోసహా అసలు కట్టాలి. అసలు మరుసటి రోజు ఇచ్చినా తీసుకుంటారు కాని వడ్డీ ఇవ్వకుంటే మాత్రం అంగీకరించరు. ఉదాసీనత : వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిలువరించడంలో ప్రభుత్వ శాఖలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఏ విధమైన లెసైన్స్‌లు లేకుండా ఆదాయ పన్ను శాఖను ఏమార్చుతూ వీరు తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సంస్థల తోడ్పాటు అందని స్థితిలో వీరి విషవలయంలో చిక్కుకుని వ్యాపారులు, చిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. పోలీసు కమిషనర్‌గా బత్తిన శ్రీనివాసులు ఉన్న సమయంలో వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఆయా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులను పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి బైండోవర్ కేసులు పెట్టడంతో పాటు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. వడ్డీ వ్యాపారులు రాజకీయ నేతల ప్రాపకంతో పోలీసులకు మామూళ్లు ఇచ్చి తమ ఆగడాలు కొనసాగిస్తున్నారు. నూతన పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటే అనేక కుటుంబాలు వీధినపడకుండా కాపాడినవారవుతారనేది పలువురి అభిప్రాయం. -
వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి
-
వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి
హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు శృతిమించుతున్నాయి. మంగళవారం తాజాగా తీసుకున్న నగదుపై వడ్డీ చెల్లించలేదంటూ వడ్డీ వ్యాపారులు ఓ మహిళపై వైర్ల, రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ కూషాయిగూడ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వడ్డీ వ్యాపారులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
ధాన్యం అమ్మితే వడ్డీకింద జమ
రాష్ర్టంలోని రైతుల ఖాతాలన్నీ బ్యాంకులలో ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మిన వారి బ్యాంక్ అకౌంట్లకు సొమ్ము వెళ్లడం తో వారు అప్పుల కింద, వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. వ్యవ సాయ పెట్టుబడికి వడ్డీ వ్యాపారుల వద్ద నాలుగైదు రూపాయలకు వడ్డీ లకు తెచ్చి పండించిన పంట సొమ్ము బ్యాంకులు జమ చేసుకుంటు న్నాయి. రైతన్నకు నెత్తిన చేతులే. వడ్డీలకు వడ్డీలు కట్టి చివరకు ఉన్న కాస్త కొండ్రా అమ్మి అప్పులు తీర్చాల్సిందే. కొనుగోలు కేంద్రాలలో కొన్న ధాన్యానికి 24 గంటలలో సొమ్ము వారి అకౌంట్లకెళతాయని సీఎం చెప్పడంతో నమ్మిన రైతులు ఇప్పుడు నట్టేటమునిగారు. అప్పు లేని బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయమని, టీడీపీ నాయకులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. అదే ముందుగా తెలియజేస్తే అన్నదాతలకు ఈ సమస్య వచ్చేది కాదు కదా! ప్రభుత్వం వెలుగు గ్రూపు సభ్యుల ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుకు యత్నిస్తూ ఆదేశాలిచ్చినా పౌరసరఫరాల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటు న్నారు. ఇంతవరకూ జిల్లా నుండి ఎంత ధాన్యం లభ్యమవుతుందనే దానిపై వ్యవసాయాధికారులను ప్రభుత్వం సంప్రదించలేదు. దీంతో అన్నదాత కనీస మద్దతు ధర కూడా లేకుండానే బైట వ్యాపారులకు అమ్ముకోవలసిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించాలి. కేవీ ఫణిప్రభాకర్ కాకినాడ, తూ.గో. జిల్లా -
వడ్డీ వ్యాపారుల చేతుల్లో అన్నదాత విల విల
సాక్షి, ఒంగోలు: వడ్డీ వ్యాపారుల చేతుల్లో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల పాలవుతున్నాడు. ఇంట్లోని చిన్నచితకా వస్తువుల దగ్గర్నుంచి చిన్నారుల చెవిపోగుల వరకు తీసుకెళ్లి తాకట్టుపెట్టుకునో.. అమ్ముకునో డబ్బు తీసుకునే మార్గాల్లో పడ్డాడు. సందట్లో సడేమియా అంటూ రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు భారీ వడ్డీలు చెబుతుండటంతో కర్షకులు బతుకు భారం బిక్కచచ్చిపోతున్నారు. కొన్నిచోట్ల మైక్రోఫైనాన్స్ సంస్థలనూ ఆశ్రయించక తప్పడం లేదు. సర్కారు నిర్వాకమే దీనంతటికీ కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకపోవడం, రీషెడ్యూల్ లేకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు. దీంతో సాగు ఖర్చుల కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే.. రైతులు ఆందోళన చేయట్లేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలపై పల్లెల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. భవిష్యత్తు అగమ్య గోచరమై దిక్కుతోచని స్థితిలో ఉంటే... రైతులంతా హాయిగా ఉన్నారంటూ సర్కారు పెద్దలు చెప్పుకోవడం విడ్డూరమేనని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్నేళ్లుగా కరువుతో సతమతమవుతున్న రైతులకు సాధారణ వడ్డీలకు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. బ్యాంకులు తప్ప మరో ఆధారం లేదు. అయితే, ఆ బ్యాంకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకులకు వెళ్తే గతంలో తీసుకున్న బకాయిలు కట్టాలంటూ నోటీసులు తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లేదని రైతులు అటువైపుగా కూడా వెళ్లడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా రైతులు వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఇంత చేసినా పంట చేతికి దక్కుతుందా..? అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రకృతి దయచూపితే తిండిగింజలు ఇంటికొస్తాయి.. లేదంటే, పస్తులు తప్పనట్లే. ప్రస్తుతం ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు అప్పులు తీసుకుంటున్నారు. ఆలస్యంగా వర్షాలు కురుస్తుండటం, ఎరువుల కొరత, పట్టిపీడిస్తున్న తెగుళ్ల బెడదతో దిగుబడి అంచనా వేయలేకపోతున్నారు. దీంతో రైతులు భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. -
అప్పు కోసం రైతు అగచాట్లు
నిజామాబాద్ వ్యవసాయం: ఆరుగాలం శ్రమించి పనిచేసే రైతన్నకు కష్టాలు ఇప్ప ట్లో తీరేలా లేవు. వరుణుడు ముఖం చాటేయడంతో పంటల సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పం ట రుణాలు మాఫీకాక పోవడం, బ్యాంకర్లు కొత్త రుణాలు వ్వకపోవడంతో పెట్టుబడులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన వ్యాపారులు అధిక వడ్డీలతో రైతుల నడ్డి విరుస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఈ ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో ఎరువుల కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం రైతుల చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉన్న కొద్ది సొమ్ము వరి విత్తనాలు, ఇతర పనులకు ఖర్చు చేశారు. దీంతో ఎరువు కొనుగోలుకు సంబంధించి అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశయ్రిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని అడ్డుపెట్టుకుని ఆదుకోవాల్సిన బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. రుణమాఫీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో రై తుల పరిస్థితి అటు నుయ్యి, ఇటు గొయ్యి అన్నట్లుగా మారింది. రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, స్పష్టమైన వైఖరి తేల్చక పోవడంతో రైతులు రుణాల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 69ను జారీచేసింది. అందులో ఏమంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతుల రుణమాఫీకి సంబంధించి ఈనెల 13వ తేదీన జీవో నంబర్ 69ను జారీచేసింది. ఈ జీఓలో లెక్కకు మించి తిరకాసులు పెట్టింది. జీఓ జారీచేసినా, దానిని అమలు చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోగా రైతులకు రుణాలను రెన్యువల్ చేయాలని బ్యాం కర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బ్యాంకర్లు మాత్రం పాత రుణాలు చెల్లించిన తర్వాతనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని అంటున్నట్లు సమాచారం. ఇలా అయితే పుణ్యకాలం కాస్త పూర్తయి రైతులు వేసిన పంట కాస్త నష్టపోయే ప్రమాదం ఉంది. అర్హులను గుర్తించాలి రైతులకు గత ఖరీఫ్‌లో వివిధ బ్యాంకులు పంట రుణాలను ఇచ్చాయి. పంట రుణాలు తీసుకున్నవారిలో 31 మార్చి 2014 వరకు చెల్లించని వారిలో అర్హులను గుర్తించి, వారి జాబితాను నివేదిక పంపాలని జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక కుటుంబంలోని ఒకరి పేరున ఉన్న పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని పేర్కొంది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలోపు ఉన్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. లబ్ధిదారుల గుర్తింపుకోసం మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తారు. తుది జాబితాను జిల్లా కలెక్టర్ కు లీడ్‌బ్యాంకు మేనేజర్ నివేదికను అందిస్తారు. దాని ఆధారంగా సంబంధిత రైతు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ఆ జీఓలో ప్రభుత్వం పేర్కొంది. ఈ తతంగం పూర్తి కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వడ్డీ రేటు పెంచిన వ్యాపారులు వ్యవసాయం చేయాలంటే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రుణం కావాలంటే పాత బాకీలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. గతంలో 3 రూపాయల వడ్డీపై ప్రైవేటు వ్యాపారులు అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు వడ్డీ రేట్లను నాలుగు రూపాయలకు పెంచారు. రైతుల అవసరం వారికి అవకాశంగా మారింది.