
వడ్డీజలగలు
సగటు జీవి విలవిల
చక్రవడ్డీలతో ఆస్తులు స్వాహా
బెదిరింపులు.. ఆపై దాడులు
కొత్త సీపీ జోక్యం కోసం ఎదురుచూపులు
నగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నెలవారీ, రోజువారీ, కాల్‌మనీ.. ఇలా రకరకాల పేర్లతో అవసరమైన వారికి వల విసిరి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆపై బెదిరింపులకు దిగుతున్నారు. తీసుకున్న అప్పుకు చక్రవడ్డీ వేసి మరీ ఆస్తులు గుంజుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి వేధింపులు తాళలేక, పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన
ఉదంతాలూ ఉన్నాయి. వీధికో వడ్డీ వ్యాపారి దర్శనమిస్తూ అభాగ్యుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు.
విజయవాడ సిటీ : నగరంలో నెలకు రూ.100 కోట్ల మేర వడ్డీ వ్యాపారం జరుగుతోందంటే వడ్డీ వ్యాపారులు ఏ మేరకు వేళ్లూనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వీరి ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతుంటే.. రాజకీయ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
నెలవారీ ముఠాలు..
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే టార్గెట్‌గా నెలవారీ వడ్డీ వ్యాపారం చేసే ముఠాలున్నాయి. వీరు ఆయా కార్యాలయాల్లో తమ ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు అవసరమైనవారిని ఆకర్షిస్తుంటారు. నెలకు నూటికి రూ.7 నుంచి రూ.10 వరకు వడ్డీకి అప్పు ఇస్తారు. హామీగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుంటారు. ఆపై ఉద్యోగుల ఏటీఎం కార్డు తీసుకుని జీతం పడగానే వడ్డీ సొమ్ము డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ వీరికి పట్టదు. పైగా సంబంధిత కార్యాలయాల ప్రధాన అధికారులతో వీరిని బెదిరిస్తారు.
రోజువారీ.. : మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ముఠా కూలీల కోసం రోజువారీ వడ్డీ వ్యాపారం సాగుతోంది. రూ.1000 నుంచి రూ.10 వేల వరకు రోజువారీ వడ్డీకి అప్పు ఇస్తారు. ఈ పద్ధతిలో నూటికి రూ.15 నుంచి రూ.20 వరకు వడ్డీ కింద ముందుగానే తీసేసుకుంటారు. రూ.10 వేలు తీసుకుంటే వడ్డీ కింద రూ.1500 నుంచి రూ.2 వేల వరకు మినహాయించుకుంటారు. మిగిలిన మొత్తాన్ని 100 రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. నెలకు నూటికి రూ.6.50 వరకు వడ్డీ పడుతుంది. పైగా వడ్డీని ముందే తీసుకోవడం ఈ విధానంలో ముఖ్యం. సాయంత్రమైతే చాలు రోజువారీ వడ్డీ వ్యాపారులు వసూళ్ల బాట పడతారు. ఎవరైనా కట్టబోమంటే దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు.
కాల్‌మనీ : పెద్ద వ్యాపారులు నగదు సర్దుబాటు చేసేందుకు వీరిని ఆశ్రయిస్తుంటారు. ఆకస్మికంగా సరుకు తీసుకోవాల్సివస్తే కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. రూ.1000కి రూ.12 వడ్డీ. సాయంత్రం వడ్డీతోసహా అసలు కట్టాలి. అసలు మరుసటి రోజు ఇచ్చినా తీసుకుంటారు కాని వడ్డీ ఇవ్వకుంటే మాత్రం అంగీకరించరు.
ఉదాసీనత : వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిలువరించడంలో ప్రభుత్వ శాఖలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఏ విధమైన లెసైన్స్‌లు లేకుండా ఆదాయ పన్ను శాఖను ఏమార్చుతూ వీరు తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సంస్థల తోడ్పాటు అందని స్థితిలో వీరి విషవలయంలో చిక్కుకుని వ్యాపారులు, చిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. పోలీసు కమిషనర్‌గా బత్తిన శ్రీనివాసులు ఉన్న సమయంలో వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఆయా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులను పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి బైండోవర్ కేసులు పెట్టడంతో పాటు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. వడ్డీ వ్యాపారులు రాజకీయ నేతల ప్రాపకంతో పోలీసులకు మామూళ్లు ఇచ్చి తమ ఆగడాలు కొనసాగిస్తున్నారు. నూతన పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటే అనేక కుటుంబాలు వీధినపడకుండా కాపాడినవారవుతారనేది పలువురి అభిప్రాయం.