అప్పు కోసం రైతు అగచాట్లు | Banks not give loans | Sakshi
Sakshi News home page

అప్పు కోసం రైతు అగచాట్లు

Published Wed, Aug 20 2014 3:05 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Banks not  give loans

నిజామాబాద్ వ్యవసాయం:  ఆరుగాలం శ్రమించి పనిచేసే రైతన్నకు కష్టాలు ఇప్ప ట్లో తీరేలా లేవు. వరుణుడు ముఖం చాటేయడంతో పంటల సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పం ట రుణాలు మాఫీకాక పోవడం, బ్యాంకర్లు కొత్త రుణాలు వ్వకపోవడంతో పెట్టుబడులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన వ్యాపారులు అధిక వడ్డీలతో రైతుల నడ్డి విరుస్తున్నారు.

 చేతిలో చిల్లిగవ్వ లేక
 ఈ ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో ఎరువుల కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం రైతుల చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉన్న కొద్ది సొమ్ము వరి విత్తనాలు, ఇతర పనులకు ఖర్చు చేశారు. దీంతో ఎరువు కొనుగోలుకు సంబంధించి అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశయ్రిస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని అడ్డుపెట్టుకుని ఆదుకోవాల్సిన బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. రుణమాఫీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో రై తుల పరిస్థితి అటు నుయ్యి, ఇటు గొయ్యి అన్నట్లుగా మారింది. రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, స్పష్టమైన వైఖరి తేల్చక పోవడంతో రైతులు రుణాల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 69ను జారీచేసింది.

 అందులో ఏమంది?
 తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతుల రుణమాఫీకి సంబంధించి ఈనెల 13వ తేదీన జీవో నంబర్ 69ను జారీచేసింది. ఈ జీఓలో లెక్కకు మించి తిరకాసులు పెట్టింది. జీఓ జారీచేసినా, దానిని అమలు చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోగా రైతులకు రుణాలను రెన్యువల్ చేయాలని బ్యాం కర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బ్యాంకర్లు మాత్రం పాత రుణాలు చెల్లించిన తర్వాతనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని అంటున్నట్లు సమాచారం. ఇలా అయితే పుణ్యకాలం కాస్త పూర్తయి రైతులు వేసిన పంట కాస్త నష్టపోయే ప్రమాదం ఉంది.

 అర్హులను గుర్తించాలి
 రైతులకు గత ఖరీఫ్‌లో వివిధ బ్యాంకులు పంట రుణాలను ఇచ్చాయి. పంట రుణాలు తీసుకున్నవారిలో 31 మార్చి 2014 వరకు చెల్లించని వారిలో అర్హులను గుర్తించి, వారి జాబితాను నివేదిక పంపాలని జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక కుటుంబంలోని ఒకరి పేరున ఉన్న పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని పేర్కొంది.

2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలోపు ఉన్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. లబ్ధిదారుల గుర్తింపుకోసం మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తారు. తుది జాబితాను జిల్లా కలెక్టర్ కు లీడ్‌బ్యాంకు మేనేజర్ నివేదికను అందిస్తారు. దాని ఆధారంగా సంబంధిత రైతు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ఆ జీఓలో ప్రభుత్వం పేర్కొంది. ఈ తతంగం పూర్తి కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

 వడ్డీ రేటు పెంచిన వ్యాపారులు
 వ్యవసాయం చేయాలంటే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రుణం కావాలంటే పాత బాకీలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. గతంలో 3 రూపాయల వడ్డీపై ప్రైవేటు వ్యాపారులు అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు వడ్డీ రేట్లను నాలుగు రూపాయలకు పెంచారు. రైతుల అవసరం వారికి అవకాశంగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement