దయలేని దా‘రుణాలు’
కిటకిటలాడుతున్న బెజవాడ పోలీసు కమిషనరేట్
♦ ఫిర్యాదుదారుల్లో ఎవర్ని కదిలించినా.. కన్నీళ్లే
♦ ఒక్కసారి ‘లొంగితే’ వడ్డీ మొత్తం మాఫీ చేస్తారట
♦ 300 దాటిన ఫిర్యాదులు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు
‘నేను చాలా అందంగా ఉంటానంట.. ఒక్కసారి తన దగ్గరకు వెళ్తే చాలంట.. వడ్డీతోపాటు అప్పుమొత్తం మాఫీ చేస్తాడంట..!’ ఇదో నిస్సహాయ ఆడపడుచు ఆవేదన.
‘ఆవిడగారు చెప్పిన లాయర్ దగ్గరకెళ్తే అప్పు సంగతి ఆయనే చూసుకుంటాడంట.. ఆపైన నాకు అప్పు భయం అక్కర్లేదంట. తోటి ఆడమనిషి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అప్పు తీసుకున్నంత మాత్రాన అంత అలుసా..?’ ఇదో బాధితురాలి ఆక్రోశం.
‘ఈ నెలాఖరులోగా అసలుతోపాటు వడ్డీ కూడా కట్టి తీరాల్సిందే. నువ్వేం చేస్తావో, ఎవరి దగ్గర పడుకుంటావో మాకు తెలియదని బెదిరిస్తున్నారు’ కన్నీళ్ల పర్యంతమైన ఎస్సీ మహిళ ఆందోళన.
- సాక్షి, విజయవాడ బ్యూరో
.... ఇలా ఫిర్యాదుదారులెవర్ని కదిలించినా కన్నీళ్లే. చెప్పే వేదనలన్నీ కనీవినీ ఎరుగని దారుణాలే. ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. నెలల తరబడి తీరని వ్యథ. నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇచ్చిన భరోసాతో ముందుకొచ్చి వడ్డీ వ్యాపారులు, కాల్‌మనీ దారుణాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. శుక్రవారం కమిషనరేట్‌కు 150 మందికిపైగా ఫిర్యాదుదారులు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ దాదాపు 300 వరకు ఫిర్యాదుల్ని స్వీకరించిన పోలీసు అధికారులు తిరిగి మరుసటి రోజు రమ్మని మిగతా వారిని పంపారు. వీరిలో మూడో వంతు ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కాల్‌మనీ బాధితులకంటే, వడ్డీ వ్యాపారుల బాధితులే ఎక్కువ మంది కమిషనర్‌ను కలిశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన పిమ్మట సెక్షన్ల వారీగా వాటిని విభజించి ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. శుక్రవారం కమిషనరేట్‌కు వచ్చిన పలువురు మహిళలు వడ్డీ వ్యాపారుల బెదిరింపులను వివరించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చర్చ కోసమంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌పై చర్చకు మాత్రం అంగీకరించకపోవడం గమనార్హం. ఎవరికోసమైతే అంబేడ్కర్ జీవితాంతం పోరాడారో ఆ అణగారిన వర్గాలవారే ఈ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ బాధితుల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ వీరి విషయాన్ని పట్టించుకోకుండా కేవలం అంబేడ్కర్‌పై చర్చ అంటూ చంద్రబాబు.. సెక్స్ రాకెట్‌పై చర్చించకపోవడం సిగ్గుచేటంటూ మహిళాలోకం మండిపడుతోంది.