'సెక్స్ రాకెట్ పై చర్చ ఇప్పుడు కుదరదు'
హైదరాబాద్: సెక్స్ రాకెట్ ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. అనుకున్నట్లుగానే సభ ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. ముఖ్యమైన కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరగాలని సభ ప్రారంభంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని పక్కకు పెడుతూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కసారిగా లేచి ప్రతిపక్షంపై మండిపడ్డారు.
మీరు ఏ అనైతిక చర్యలకు పాల్పడలేదా, మీకు వాటిల్లో భాగస్వామ్యం లేదా అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పక్షానా అభ్యర్థిస్తున్నామని, సభా సమయం వృధా కాకుండా ముందు ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత అంబేద్కర్ అంశంపై చర్చ, తర్వాత చంద్రబాబు ప్రకటన ఉంటుందని, ఆ తర్వాతే కాల్ మనీ అంశంపై చర్చ అని అన్నారు. దీంతో వివరణ ఇవ్వాల్సిన సమయంలో ఎదురుదాడులకు దిగడమేమిటని నిలదీస్తూ మరోసారి సభలోని ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఈలోగా యనమల రామకృష్ణుడు లేచి ప్రభుత్వం బీఏసీలో నిర్ణయంచిందే చేస్తామని అన్నారు. అచ్చెన్నాయుడు చెప్పినట్లు సభ కొనసాగుతోందని అన్నారు. అసలు ప్రతిపక్ష సభ్యులకు కాల్ మనీపై చర్చించే నైతిక హక్కే లేదని అన్నారు.