కాల్ మనీపై కలవరమెందుకు?
► చర్చకు ముందుకు రాని అధికార పక్షం
► కాల్ మనీపై తొలిరోజు అట్టుడికిన అసెంబ్లీ
►ప్రతిపక్షం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
►ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
► నినాదాలతో హోరెత్తిన శాసనసభ
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపుతున్న కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై శాసనసభలో చర్చకు అధికార తెలుగుదేశం పార్టీ తొలిరోజు వెనుకడుగు వేసింది. ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడి చేయడానికి ఎజెండాలో లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి కాల్ మనీ అంశాన్ని వాయిదా వేసింది. కాల్ మనీ వ్యవహారంలో అసలైన దోషులు బయటకు రావాలని, అందుకు ఎంతో కీలకమైన అంశంపై తొలి ప్రాధాన్యత అంశంగా చర్చించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రతిపాదించగా స్పీకర్ తిరస్కరించారు. కాల్ మనీ వ్యవహారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తక్షణం చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలతో నిరసనలు తెలిపారు. దాంతో పలుసార్లు వాయిదాల అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
నిరుపేదలు, మహిళల జీవితాలతో ఆటలాడుకున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ పై వెంటనే చర్చించి తక్షణం దోషులను శిక్షించాలని ప్రతిపక్షం పట్టుబట్టగా అధికారపక్ష సభ్యులు సభలో అడుగడుగునా అడ్డుపడ్డారు. విపక్ష సభ్యులు పోడియం వద్ద నిరసన కొనసాగిస్తున్న దశలో సభ ఆర్డర్‌లో లేకపోయినప్పటికీ అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు. ఎప్పటిలాగే విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడంతోనే టీడీపీ నేతలు కాలం గడిపారు.
రోజంతా సభ విపక్ష సభ్యుల నిరసనలతో హోరెత్తగా, అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అది టీవీల్లో ప్రసారం కాకుండా కెమెరాలకు అడ్డంగా ఉన్నారంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు సభ్యులను రెండు రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ పార్టీ సభ్యులు శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావులను సభ నుంచి ఒకరోజు సస్పెండు చేయాలని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా, స్పీకర్ వారిని రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు.
వైఎస్ జగన్ మైక్ కట్
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ రెండుసార్లు అవకాశమిచ్చినట్టే ఇచ్చి మైక్ కట్ చేశారు. కాల్ మనీ వ్యవహారంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన వారితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసి దిగిన ఫోటోలను ఈ సందర్భంగా జగన్ స్పీకర్‌కు చూపిస్తూ.. అదే విషయాన్ని ప్రస్తావించబోగా వెంటనే స్పీకర్ మైక్ కట్ చేశారు. దాంతో ఆ పార్టీ సభ్యులంతా పోడియం చుట్టుముట్టి నిరసనగా నినాదాలు చేశారు.
మా ప్రకటన తర్వాతే...
కాల్ మనీ చర్చ జరపాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టగా, మధ్యలో స్పందించిన ఆర్థికమంత్రి ఆ విషయంపై శుక్రవారం సభలో ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, ఆ ప్రకటన తర్వాతే చర్చ చేపడుతామని చెప్పారు. ఎంతో ముఖ్యమైన అంశమైనందున ముందు దానిపై చర్చ అనంతరం మిగతా ఎజెండా చేపట్టాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. ఈ రకమైన గందలగోళ పరిస్థితుల నడుమ స్పీకర్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
తెరపైకి అంబేద్కర్
తొలిసారి సభ వాయిదా పడిన మళ్లీ సమావేశమైన సందర్భంలో అధికారపార్టీ సభ్యులు అంబేద్కర్‌ను తెర మీదకు తెచ్చారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో పార్లమెంట్‌లో అంబేద్కర్-రాజ్యాంగం అనే అంశం మీద చర్చ జరిగిందని, అదే అంశం మీద శాసనసభలో చర్చ జరగాలని కోరింది. దాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్షంపై విమర్శల దాడి కొనసాగించింది.
అంబేద్కర్‌తో రాజకీయమా...
సమస్యను పక్కదారి పట్టించడానికి తెలుగుదేశం అంబేద్కర్‌ను వాడుకుంటోందని జగన్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ రకంగా చేయడం వల్ల అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.