బాబు ఏమని ప్రకటిస్తారో? ఎలా మేనేజ్ చేస్తారో?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేయమైన కాల్ మనీ సెక్స్ రాకెట్ పై శుక్రవారం కూడా అసెంబ్లీ దద్దరిల్లుతోంది. ఎంతో దారుణమైన ఈ అంశంపై చర్చ జరపాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా ఆ విషయాన్ని అప్రస్తుతం చేసి, అవసరమైతే ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి సభను ముందుకు తీసుకెళ్లాలని అధికార పక్షం భావిస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రమే ముందుగా కసరత్తు కూడా చేసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన అవినీతి అంశాలపై చర్చను లేవనెత్తినప్పుడు మూకుమ్మడిగా అధికార సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై ఎలా దాడులు చేశారో అలాంటి పరిస్థితినే మరోసారి సభలో సృష్టించాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
వాస్తవానికి కాల్ మనీ సెక్స్ రాకెట్ పై తాను ప్రకటన చేసిన తర్వాతే చర్చ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ప్రకటించినా అసలు ఆయన ఎలాంటి ప్రకటన చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఈ రాకెట్ లో దాదాపు అందరూ టీడీపీ నేతలే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ పార్టీ, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వరకు అంతా ఈ అంశాన్ని చర్చించుకుంటున్నారు.
ఈ సమయంలో చంద్రబాబు నాయుడు చేసే ప్రకటన సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేలా ఉంటుందా.. అసలు వారి ప్రస్తావనే రాకుండా వడ్డీ వ్యాపారుల పేరిట ప్రకటన చేస్తారా? లేక గతంలో మాదిరిగా అసలు విషయాన్ని మాట్లాడకుండా ఓ సుధీర్ఘ ఉపన్యాసం చేసి ప్రతిపక్ష సభ్యులను అసహనానికి గురిచేసి వారిపై వేటు వేయిస్తారా అనేది ఎదురు చూడాల్సిందే.