సాక్షి, ఒంగోలు: పంటల బీమా పథకం రైతులకు అక్కరకు రావడం లేదు. పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినా..రైతులు దాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతులు ప్రీమియం చెల్లించి బీమా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ప్రకటించింది. అయితే, బ్యాంకులు కొత్త రుణాలను పంపిణీ చేయనప్పుడు.. ప్రీమియం ఏవిధంగా మినహాయింపు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రుణాల మాఫీకి మరో రెండు నెలలు పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో చెప్పారు. దీనిపై రైతులు మరింత డీలాపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా తమకు కొత్త రుణాలిస్తే.. బీమా ప్రీమియం కూడా చెల్లించే అవకాశం ఉండేదని ఆశపడ్డారు. అలాంటిది, రుణమాఫీపై ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనివ్వడం లేదు. దీంతో బీమాపథకం గడువు పొడిగించినా రైతుకు ఒనగూరే లాభం లేదని తేలిపోయింది.
బ్యాంకు రికవరీలపై కొత్తపల్లవి
జిల్లాలో ఏటా రైతులు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. తీవ్ర పంటనష్టాన్ని చవిచూసినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా బీమా పథకం ఆదుకుంటూ ఉండేది. ప్రధాన పంటలైన వరి, సజ్జ, మొక్కజొన్న, కంది, ఆముదం, మిరప (నీటి ఆధారం), మిరప (వర్షాధారం), పత్తి (వాతావరణ ఆధారితం) వంటి వాటికి బీమాపథకాన్ని వర్తిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా పంటరుణాల పంపిణీ లేకపోవడంతో బీమా పథకం కింద దరఖాస్తు పెట్టుకునే నాథుడే కరువయ్యాడు.
ఈఏడాది జూన్ నెల 15వ తేదీ నుంచి జూలై 31 వరకు జిల్లాలో రుణాల పంపిణీని పరిశీలిస్తే.. కొందరు సాగుపెట్టుబడులకు మహిళల పేరిట బంగారం తనఖా పెట్టి రుణాలు పొందినట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బున్నోళ్లంతా పాతబకాయిలు చెల్లించి కొత్తరుణాలతో బీమా ప్రీమియం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారపార్టీ నేతలు కొత్తపల్లవి అందుకుంటున్నారు.
వాస్తవానికి జిల్లాలో సన్న, చిన్నకారు రైతుల సంఖ్య అధికంగా ఉంది. అందులోనూ మొత్తం 7.5 లక్షల మంది రైతుల్లో 65 శాతం నుంచి 70 శాతం కౌలురైతులే ఉన్నారు. పాతబకాయిలు చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్న రైతుల్లేరని బ్యాంకర్లు ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు. కిందటి నెల వర్షాభావంతో వేరుశనగ పంట అప్పుడే ఎండిపోయే దశకొచ్చింది. ఎండిపోతున్న పంటను చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించి ఉంటే, నష్ట పరిహారమన్నా వచ్చేదన్న భావన రైతుల్లో కలుగుతోంది.
‘మాఫీ’ కలేనా.. ?
ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అధికారపార్టీ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న రుణమాఫీ అంశం ఇప్పుడు ప్రభుత్వం మెడకే చుట్టుకుంటోంది. 2013-14లో కరువు ప్రభావిత 45 మండలాల్లో 2 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను రీషెడ్యూల్ చేసే పరిస్థితుల్లేవని, అప్పట్లో 50 శాతానికి మించి పంటనష్టం జరగలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులు పంట రుణాలుగా తీసుకున్న రూ.6900 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధనరూపంలో అందిస్తే ఆ రుణాల్ని మాఫీ చేయగలమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. బీమాప్రీమియంపై గడువు పొడిగించినా.. కొత్త రుణాలివ్వనప్పుడు బ్యాంకర్లు ప్రీమియం మినహాయించే అవకాశం లేకపోవడంతో జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.
బీ‘మాయ’
Published Wed, Aug 6 2014 3:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement