చిత్తూరు టీడీపీలో బ్యానర్ల రగడ..!
నిన్న నాని బ్యానర్లపై ఇంకు చల్లారు
నేడు మేయర్ బ్యానర్ల చించివేత
తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు
చిత్తూరు (అర్బన్): చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. పైకి ఒకరినొకరు పలకరించుకున్నా లోలోపల మాత్రం ఒకరితో ఒకరికి పొసగడం లేదు. ఫలితంగా నేతలు బ్యానర్లను చించుకునే వరకు వచ్చారు. నగరంలోని ఎంజీఆర్ వీధిలో మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌కు సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్‌ను బుధవారం చించివేశారు. ఇది ముమ్మాటికీ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గం చేసిన పనేనంటూ మేయర్ అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారు.
నెల రోజుల క్రితం చిత్తూరు నగరంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పులి వర్తి నాని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో పెద్దఎత్తున ఫెక్ల్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని సహించలేని అదే పార్టీలోని కొందరు వ్యక్తులు గాంధీ విగ్రహం వద్ద ఉన్న నాని డిజిటల్ ఫ్లెక్సీపై ఇంకు చల్లారు. పక్కనే ఉన్న మరో బ్యానర్‌ను చించివేశారు. దీనిపై టీడీపీలోని ఇరువర్గాల నాయకుల్లో అం తర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అప్పట్లో ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ పార్టీలోని పెద్దలు సర్దుబాటు చేశారు. అయితే బుధవారం కార్పొరేషన్ మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌కు సంబంధించి డిజిటల్ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీనిపై మేయర్ వర్గం గుర్రుగా ఉంది. చిత్తూరు నగరంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మాలని రెండు రోజుల క్రితం ఎక్సైజ్ ఈఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్యం విక్రయాల్లో టీడీపీ నాయకుల సిండికేట్ ఉండటంతో పార్టీలోని ఓ వర్గం వ్యక్తులు ఇలా ఫ్లెక్సీ బోర్డులను చించేశారని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. దీనికి తోడు చిత్తూరు నగరంలో నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలను అరికట్టడానికి పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే మేయర్ దంపతుల ఫ్లెక్సీను చించివేయడం టీడీపీ అంతర్గత కుమ్ములాటను బహిర్గతం చేసినట్టయింది