సాక్షి, విశాఖపట్నం: జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ కోస్తాంధ్ర అధ్యక్షులు బర్కత్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌పీఆర్ నమోదుకు పాతవిధానాన్నే అనుసరించాలని సీఎం జగన్ డిమాండ్ చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎఎ రాజ్యాంగ విరుద్ధమన్నారు. మోదీ సర్కారు సమాన హక్కులు, అవకాశాలు అనే రాజ్యాంగ హక్కును కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌పీఆర్ నమోదు 2010లో చేపట్టినట్లుగానే జరగాలని వైఎస్ జగన్ తీర్మానం చేయనున్నారని, ఆయనపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తెలుగుదేశం కూడా అసెంబ్లీలో, శాసన మండలిలో ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలుగుదేశం ఇకనైనా మద్దతివ్వాలి
‘చంద్రబాబు నాయుడు ఇంతవరకూ ఎన్‌పీఆర్, సీఏఏల మీద స్పందించకపోవటం దారుణం. అమరావతి తప్ప మరో సంగతి పట్టించుకోని తెలుగుదేశం..ఇకనైనా వైకాపా ఎన్‌పీఆర్ మీద చేసే తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో దీన్ని అమలు జరిపేది లేదని గతంలో కడప వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. తాజాగా ఎన్‌పీఆర్ బిల్లుపై అసెంబ్లీలో, కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని చెప్పడం మైనారిటీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖ రాస్తానని చెప్పడం మంచి పరిణామం. మైనారిటీల భద్రతకు, రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన నిలుస్తోంది.
ముస్లిం మైనారిటీలు భయపడాల్సిన పనిలేదు
కుల, మత ప్రాతిపదికన చేసే చట్టాల అమలు సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలు ఎన్‌పీఆర్‌కు భయపడాల్సిన అవసరం లేదు. వారి సంపూర్ణ హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో దూరదృష్టితో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషనను కల్పించగా... నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మరింత మేలు చేసే దిశగా తప్పనిసరిగా పనిచేస్తారనే నమ్మకముంది’ బర్కత్ అలీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment